క్యాన్సర్ ను ‘ఆత్మవిశ్వాసం’ తో జయించండి!

You are currently viewing క్యాన్సర్ ను ‘ఆత్మవిశ్వాసం’ తో జయించండి!

ఆత్మవిశ్వాసం.. దీనినే మనం  సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాము.

ఆత్మవిశ్వాసం ఒక మనిషి తనకు తాను చేసుకునే చికిత్స..ఇది ఏ సమస్యకైనా పరిష్కారాన్ని చూపగలదు.

ప్రతీ మనిషికీ ఆత్మవిశ్వాసం ఒక రక్షణ కవచం లాంటిది. మానసికంగా అయినా శారీరకంగా అయినా వచ్చే సవాళ్ళను ఎదుర్కొని పోరాడటానికి ఆత్మవిశ్వాసం ఒక ఆయుధం కూడా! ఎన్నోసార్లు మనకు సమస్య నుండి బయట పడటానికి ధైర్యాన్ని ఇచ్చేది మన ఆత్మవిశ్వాసమే..మన లోని భయాన్ని పోగొట్టి ధైర్యంగా సమస్యను ఎదుర్కునేలా చేసేది మన కూడా మన ఆత్మవిశ్వాసమే!

ఒక మనిషికి ప్రాణాలు తీస్తానంటూ క్యాన్సర్ వచ్చి బాధిస్తున్నా దానికి భయపడకుండా గెలుస్తానని నమ్మకంతో  గడపదాటి హాస్పిటల్ వైపు నడిపించింది ఆత్మవిశ్వాసమే..

ఏళ్ళు గడుస్తున్నా ఇంకా సమస్య తీరిందో లేదో తెలియని సందేహంలో ఉన్నా వేనుతిరగక ధైర్యంగా పోరాడితే..పోరాడి క్యాన్సర్ ను సైతం జయిస్తే దానికి కారణం అతని ఆత్మవిశ్వాసమే..

ఆత్మవిశ్వాసానికి ఆరోగ్యానికి సంబంధమేంటి ? 

మన శరీరానికి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి, వాటికి మన జీవన శైలి కారణం కావచ్చు, లేదా ఆహార అలవాట్లో ఇంకా తెలియక చేసిన తప్పిదాలో ఎవైనా కారణం కావొచ్చు. ఈరోజుల్లో ఆరోగ్య సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. ఇంకో ప్రమాదమేమిటంటే మనకు ఇన్ఫర్మేషన్ ఎక్కువగా తెలిసిపోతుంది.. ఎంత ఎక్కువగా అంటే అవసరమైన దానికంటే చాలా రెట్లు ఎక్కువగా! 

అంతా ఇంటర్నెట్ పుణ్యమే !  అది చెడ్డ విషయం అని అయితే  అనలేం. చిన్న ఉదాహరణ తీసుకుంటే  మనకు ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య రాగానే  ముందు ఇంటర్నెట్ లో ఈ లక్షణాలు ఏ వ్యాధి వి అని వెతిక్కేస్తున్నాం, అక్కడేదో పెద్ద ప్రమాదకరమైన సమస్య పేరు కనబడగానే భయపడి డిప్రెషన్ లోకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. మరి కొందరైతే ట్రీట్మెంట్ కూడా అదే ఇంటర్నెట్ లో వెతికేస్తుంటారు. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయం! తెలియని భయం! ఆ భయమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవటం.

 అలా స్వంతంగా ట్రీట్మెంట్ తీసేసుకొని ఆ సమస్యను వదిలేస్తే ఆ లక్షణాలు పెరిగి పెరిగి చివరికి ఏ దీర్ఘకాలిక వ్యాధిలానో, క్యాన్సర్ గానో మారిపోతే..ఆ నిర్లక్ష్యం ఎవరిది.

అవగాహన ఉండి..అవకాశం ఉండి..వైద్యుడిని సంప్రదించని వారిదే కదా !

అదే ముందుగా ఈ విషయం  తెలియగానే ధైర్యంగా ముందుకొచ్చి సమస్య వైద్యుడికి చెబితే లక్షణాలు ముందుగా బయటపడ్డందుకు సమస్య కూడా త్వరగా తొలగిపోయేదేమో..సరైన సమయానికి సరైన వైద్యం కాపాడలేని ప్రాణమంటూ లేదు కదా.. అందుకే మన ఆరోగ్యానికి కూడా మన ఆత్మవిశ్వాసం రక్షణ.

ఒకవేళ క్యాన్సర్ సోకినట్లైతే..ఆ మనిషిని ఆత్మవిశ్వాసం ఎలా కాపాడగలదు? 

క్యాన్సర్ తో ప్రయాణం అంట సులభమైనదైతే కాదు..ఎన్నో మానసిక శారీరక సవాళ్ళతో పాటుగా సామాజిక సవాళ్ళను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్యాన్సర్ చికిత్స శారీరకంగా మనిషిని మార్చేయగలదు. ఒకప్పటి ఆహార్యం..ధృడత్వం ఉండకపోవచ్చు..అవన్నీ చికిత్సలో భాగమే అవ్వచ్చు.

అలంటి సమయంలో తోడుగా ఉండేది ఆత్మవిశ్వాసమే! 

ఖచ్చితంగా నేను గెలిచే వస్తానన్న నమ్మకం అతనికుంటే క్యాన్సర్ మాత్రం ఎం చేయగలదు.. 

క్యాన్సర్ కణాలపై దాడి చేయటానికి వైద్యం సహాయపడితే..

భయం మరియు ఆందోళనపై పోరాడటానికి ఆత్మవిశ్వాసం సహాయపడుతుంది..

రెండూ కలిసి మనిషిని బ్రతికించగలవు.సరైన సమయానికి సరైన వైద్యం ఎప్పుడూ మంచి ఫలితాన్నే ఇస్తుంది. ఆ వైద్యానికి ఆత్మవిశ్వాసం తోడైతే ఫలితం ఇంకా మెరుగ్గా ఉంటుంది.   

కఠినమైన సమయాల్లో ఆత్మవిశ్వాసంతో ఎలా ఉండాలి?

ఇంకొకరితో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి,

మీ సమస్య,  వేరొకరి సమస్య ఎప్పుడూ ఒకటి కాదు ,అందుకే ఎప్పుడూ వేరొకరికి ఫలితం కనబడుతుంది మీకు కనబడట్లేదు అని పోల్చుకొని బాధపడకండి. ప్రతీ ప్రశ్నకు సమాధానం వేరుగా ఉంటుంది, ఎదో ప్రశ్న సమాధానాన్ని మీ ప్రశ్న సమాధానంతో పోల్చుకొని ఒకేలా లేదని బాధపడితే అర్థమేముంది.

మీ సమస్య పరిష్కరమవ్వటానికి సమయం ఇవ్వండి, ఓపికతో ధైర్యంగా ఉండండి, వేరొకరితో పోల్చుకొని మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మీ ప్రయాణం మీదే !

పాజిటివ్ మనుషుల మధ్యలో ఉండండి,

ఎప్పుడూ సానుకూలంగా ఉండే స్నేహితులతో ఉండండి, పాజిటివ్ మైండ్ సెట్ తో పాజిటివ్ పీపుల్ మధ్యలో ఉండటం మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. పాజిటివ్ ఆలోచనలు ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి.ఎలాంటి సమస్యనైన ఎదుర్కునే ధైర్యాన్ని ఇస్తాయి.

శారీరక,మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతను ఇవ్వండి,

ఈ మూడు విషయాలను దృష్టిలో ఉంచుకోండి.

  • ఆహారం: ఆరోగ్యకరమైన ఆహరం తిన్నప్పుడు శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి,సరైన సమయానికి పోషకాలు నిండిన ఆహరం తీసుకోవటం అలవాటు చేసుకుంటే మానసికంగా,శారీరకంగా బలంగా ఉండగలం.
  • వ్యాయామం: శారీరక వ్యాయామం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని అధ్యయనాలు స్థిరంగా చూపిస్తున్నాయి. ఉదాహరణకు,2016 లో చేసిన  ఒక అధ్యయనం ప్రకారం వ్యాయామం చేసేవారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నట్లు తేలిందట.ధ్యానం కూడా ఆత్మవిశ్వాసం పై ప్రభావం చూపగలదు
  • నిద్ర: సరైన క్వాలిటీ స్లీప్ అంటే ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏడు నుండి తొమ్మిది గంటల ప్రశాంతమైన నిద్ర మానసికంగా మరియు శారీరకంగా బలంగా ఉండటానికి సహాయపడుతుంది,సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం.

క్యాన్సర్ ను జయించాక ఆత్మవిశ్వాసాన్ని ఎలా తిరిగి పొందాలి?

క్యాన్సర్ తర్వాత జీవితం ఒక  సవాలుగా ఉండవచ్చు ,మళ్ళీ పాత రొటీన్ కు రావటం కష్టం అనిపించవచ్చు.

  • అందుకోసం మంచి సపోర్ట్ నెట్‌వర్క్‌ను సృష్టించడం చాలా అవసరం. ఇలాంటి సమయంలో , మీ చుట్టూ ఉన్న వ్యక్తులు సరైన వారు అవ్వటం చాలా ముఖ్యం. ఎన్నో రోజుల పాటు ఆసుపత్రిలో గడిపిన తర్వాత, మళ్ళీ ఈ షెడ్యుల్ అలవాటు అవ్వటానికి చుట్టూ ఉండే మనుషుల సహకారం అవసరం.అలాగే క్యాన్సర్ తో ప్రయాణం ముగిసాక మానసికంగా మరియు శారీరకంగా మీలో జరిగిన మార్పులను యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ప్రశాంతంగా ఉండగలరు.
  • అలాగే క్యాన్సర్ మళ్ళీ రేకరెన్స్ రూపంలో తిరిగి వస్తుంది అనే భయం ఉండవచ్చు. అలంటి భయం ఉండటం సహజమే. ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏదైనా సందేహంగా అనిపిస్తే వైద్యుడి సలహా తీసుకోండి. భయాలను లోపలే ఉంచుకోవటం వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాము.
  • మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాన్ని ఇవ్వకండి, కుటుంబంతో సమయం గడపండి,ఏదైనా సరే అన్ని విషయాలను చర్చించండి, అలాగే సెల్ఫ్ కేర్ అనేది కూడా ముఖ్యమే.
  • క్యాన్సర్ తో ప్రయాణం ముగిసాక ఖచ్చితంగా ఎలాంటి దురలవాట్లకు అవకాశం ఇవ్వకండి,మద్యపానం ధూమపానం జోలికి అస్సలు వెళ్ళకండి. ఆరోగ్యంపట్ల శ్రద్ధను వహించండి.

చివరగా

జీవితంలో మానసికంగా అయినా,శారీరకంగా అయినా వచ్చే సమస్యలను ఎదుర్కోవటానికి ఆత్మవిశ్వాసం అనేది చాలా అవసరం అనే విషయాన్నీ గుర్తుంచుకోండి. ఈ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది, భయం మనకు ఆ పరిష్కారాన్ని తెలియనివ్వదు.భయాలను ధైర్యంగా ఎదిరించండి. ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి. మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి  ఈ క్రింది  లింక్ పై క్లిక్ చేయండి.

Also read: క్యాన్సర్ ప్రూఫ్ జీవితాన్ని అనుభవించగలమా? ఎలా?