బినైన్ ట్యూమర్స్ (Benign Tumors) అంటే ఏమిటి?
చాలామంది మన శరీరంలో అనుమానాస్పదంగా ఏవైనా కణతులు లేదా గడ్డలు కనిపిస్తే క్యాన్సర్ గడ్డలేమో అని అపోహపడుతూ, ఆందోళన చెందుతుంటారు. ఎందుకంటే క్యాన్సర్ టూమర్ల పట్ల సరైన అవగాహన లేకపోవడం వలన ఇలా జరుగుతుంటుంది. ఇది సహజమే అయినప్పటికీ ట్యూమర్స్ గురించి తెలుసుకోవడం వలన ఈ అపోహాలకి చెక్ పెట్టవచ్చు.
ట్యూమర్స్ ఎన్ని రకాలు?
బినైన్ ట్యూమర్స్, ప్రీ మ్యాలిగ్నెంట్ మరియు మ్యాలిగ్నెంట్ అనే మూడు రకాల ట్యూమర్లు ఉన్నాయి. వీటిలో కేవలం మ్యాలిగ్నెంట్ ట్యూమర్లు మాత్రమే క్యాన్సర్ ట్యూమర్లు మరియు అత్యంత ప్రమాదకరమైనవి కూడా. కానీ బినైన్ ట్యూమర్లు ప్రమాదకరమైనవి కాదు. అలాగే ఇవి క్యాన్సర్ ట్యూమర్స్ కూడా కాదు.కేవలం సాధారణ ట్యూమర్స్ మాత్రమే. ప్రీ మ్యాలిగ్నెంట్ ట్యూమర్లు, క్యాన్సర్ ట్యూమర్లా అనే సందేహం కొంతమందిలో ఉంటుంది.ప్రీ మ్యాలిగ్నెంట్ ట్యూమర్లు ఏర్పడినప్పుడు ఎలాంటి క్యాన్సర్ ప్రభావాన్ని కలిగి ఉండవు.కానీ ఎప్పుడైతే ఈ ప్రీ మ్యాలిగ్నెంట్ ట్యూమర్లను మనం నిర్లక్ష్యం చేస్తామో అప్పుడే ఇవి మ్యాలిగ్నెంట్ ట్యూమర్లుగా మారుతాయి.అప్పుడు మన శరీరంలో క్యాన్సర్ ప్రభావం మొదలవుతుంది.
ప్రమాదాకరం కానటువంటి బినైన్ ట్యూమర్స్ :
మన శరీరంలో అసాధారణ రీతిలో పెరిగే కణతులను నిరపాయమైన కణతులు అని పిలుస్తారు. నిరపాయమైనవి అంటే ఎటువంటి అపాయం కలిగించనివి అని అర్థం. వీటినే ఆంగ్లంలో బినైన్ ట్యూమర్స్ అని అంటారు. అలాగే నాన్ క్యాన్సరస్ (A non-cancerous) ట్యూమర్స్ అని కూడా అంటుంటారు. నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ అంటే క్యాన్సర్ కానివి అని అర్ధం. ముఖ్యమైన విషయం ఏమిటంటే బినైన్ ట్యూమర్లు స్వతహాగా మన శరీర భాగలపై పై దాడి చెయ్యవు అలాగే ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపవు. అంతేకాకుండా ఇతర క్యాన్సర్ ట్యూమర్ల మాదిరిగా ఒక చోట నుంచి ఇంకో చోటకి వ్యాపించవు. కానీ ఇవి మన బాడీలో ఎక్కడపడితే అక్కడ ఏర్పడటం, పెరగటం వంటివి చేస్తుంటాయి.
వీటి వలన సమస్య ఎప్పుడు ఏర్పడుతుందంటే మన బాడీలోని వైటల్ బాడీ పార్ట్స్ పక్కన ఈ బినైన్ ట్యూమర్స్ పెరగటం వలన ఆర్గాన్స్ మెయిన్ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది. ఉదాహరణకి రక్త నాలలాల పక్కన ఈ బినైన్ ట్యూమర్ ఏర్పడితే క్రమక్రమంగా ఈ ట్యూమర్ పెరిగి పెద్దదయ్యి రక్త నాళాలను నొక్కి పెడుతుంది. దాంతో రక్త నాళాల ఫంక్షనింగ్ దెబ్బతిని రక్త సరఫరాలో ఇబ్బంది ఎదురవుతుంది. ఒకవేళ గొంతు పక్కన ఏర్పడితే ఆహారం తీసుకోవటానికి ఇబ్బంది కలగటం. ప్రేగులు దగ్గర ఏర్పడితే మనం తీసుకునే ఆహారం ప్రేగుల ద్వారా జీర్ణాశయంలోకి వెళ్ళడానికి ఇబ్బంది ఏర్పడటం. చర్మం పై ఏర్పడి ఉబ్బెత్తుగా కనిపించడం. ఇలా రకరకాల సమస్యలకి ఈ బినైన్ ట్యూమర్స్ పరోక్షంగా కారణం అవుతుంటాయి.
బినైన్ ట్యూమర్స్ లక్షణాలు
ఈ బినైన్ ట్యూమర్స్ ఏర్పడినప్పడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయనే విషయంపై ఇప్పటి వరకూ సరైన క్లారిటీ రాలేదు కానీ మన శరీరంలోని అవయవాల పని తీరులో కలిగే కొన్ని మార్పులు, సంకేతాలు మాత్రం ఎదురవుతాయి. చర్మం పై గడ్డలు ఉన్నట్లు అనిపించటం,ఆకలి లేకపోవటం,అప్పుడప్పడు శరీరాన్ని తడుముకున్నప్పుడు చేతికి గడ్డలు తగలడం, శ్వాస తీసుకోవటానికి ఇబ్బందిగా ఉండటం,వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరో ముఖ్యమైన ఏమిటంటే ఈ బినైన్ ట్యూమర్స్ లక్షణాలు కూడా దాదాపుగా క్యాన్సర్ వ్యాధి లక్షణాల మాదిరిగానే ఉంటాయి.కాబట్టి ఈ లక్షణాలు బయట పడినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ ని సంప్రదించి బయాప్సీ, ఇమేజింగ్ టెస్ట్స్ అంటే CT స్కాన్, MRI లేదా అల్ట్రాసౌండ్, మామోగ్రామ్,ఎక్స్-రే వంటి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది.ఇక ఈ బినైన్ ట్యూమర్స్ ట్రీట్మెంట్ విషయానికొస్తే ఎక్కువమంది డాక్టర్లు సర్జరీని సూచిస్తూ ఉంటారు.ఈ సర్జరీలో భాగంగా వైద్యులు సర్జరీ చేసి ట్యూమర్ ని పూర్తిగా తొలగించేస్తుంటారు. కానీ అన్ని బినైన్ ట్యూమర్స్ ని సర్జరీ చేసి తొలగించడానికి వీలు పడదు.
ముఖ్య గమనిక :
ఇక్కడ పొందు పరచిన సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Also read: మైగ్రేషన్ క్యాన్సర్ రావడంలో కీలక పాత్ర పోషిస్తుందా?