పొగ త్రాగడం వలన క్యాన్సర్ వస్తుందా?

You are currently viewing పొగ త్రాగడం వలన క్యాన్సర్ వస్తుందా?

మనం చూస్తుంటాం…. చాలా మంది రోడ్డు పక్కల బహిరంగంగానే సిగరెట్లు కాలుస్తూ ఉంటారు.

సిగరెట్ ప్యాకెట్ల మీద పొగాకు క్యాన్సర్లకు కారణం అని కూడా రాసి ఉండ్తుంది. అయినా వాళ్ళకు అదేం పట్టదు.

ఆ ఇప్పటివరకు ఏం కాలేదు కదా అన్న భావన ఉంటుంది.

అసలు పొగ త్రాగడం వలన క్యాన్సర్ వస్తుందా? అన్న వివరాలు తెలుసుకుందాం

పొగ తాగడం వలన క్యాన్సర్ వస్తుందని అనేక మాధ్యమాల్లో చెబుతూ వస్తున్నారు. టీవీల్లో, సినిమా థియేటర్లలో… పెద్ద పెద్ద సెలబ్రిటీలతో ఈ విషయాన్ని చెప్పిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ  పెద్దగా ప్రయోజనమైతే ఏమీ కనిపించడం లేదు. సరికదా… ఇది సిగరెట్ల ప్రచారానికి ఉపయోగపడుతున్నట్లుంది తప్ప ధూమపానం నిషేధానికి ఏమాత్రం ఉపయోగ పడుతున్నట్లుగా లేదు. కొంచెం నిశితంగా గమనిస్తే… ప్రతి వంద మీటర్లకు ఒక సిగరెట్ షాపు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి వందమందిలో పది మంది ధూమపానం చేస్తున్నత్తు సర్వేలు చెబుతున్నాయి. అందుకే సిగరెట్ల వినియోగం వలన క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది.

పొగ త్రాగడం వలన ఏయే  క్యాన్సర్లు వస్తాయి

పొగ తాగే అలవాటు ఉంటే లంగ్ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, నోటి క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇలా ఏ రకమైన క్యాన్సరైనా వచ్చే అవకాశముంది. పురుషులలో అత్యధికంగా వచ్చే లంగ్ క్యాన్సరుకు ఈ పొగాకే కారణం అనడంలో సందేహం లేదు. లంగ్ క్యాన్సర్ తోపాటు నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్ల సంఖ్య కూడా  విపరీతంగా పెరుగుతోంది.

సిగరెట్ తాగేటప్పుడు… ఒకసారి పొగ లోపలికి తీసుకుంటే 7000లకు పైగా ప్రమాదకరమైన టొబాకో ఇంగ్రేడియంట్స్ ఒకేసారి ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళిపోతాయి. ఇవన్నీ క్యాన్సర్ కారకాలే. వీటిలో కనీసం వందకి పైగా కార్సినోజెన్స్ ఉంటాయి. నికోటిన్, ఎసిటాల్ డిహైడ్, బెంజీన్, N-నైట్రో సమైన్స్, 1,3- బ్యుటాడిన్, అరోమాటిక్ అమైన్స్, పాలి అరోమాటిక్స్ వంటి ప్రాదకరమైన క్యాన్సర్ కారకాలు శరీరంలో చేరి ఆరోగ్యకరమైన కణాలపై ప్రభావం చూపుతాయి. వీటి ప్రభావం జన్యుకణాలపై పడితే జన్యుమార్పు చోటుచేసుకుంటుంది. ఒక జన్యుకణంలో జరిగే మార్పు క్యాన్సర్ కణాల విభజనకు దారితీస్తుంది. తద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశముంది. ఇవి క్యాన్సర్ కణాలను వృద్ధి చేస్తాయి.

ముఖ్య గమనిక :

ఒక అధ్యయనం ప్రకారం పురుషులలో 90% మందికి పొగాకు నమలడం, ధూమపానం చేయడం వల్లనే ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తోందని తేలింది. నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్లలో కూడా ఎక్కువ శాతం పొగతాగడం వల్లనే వస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. సిగరెట్ పొగ నుండి ఉత్పన్నమయ్యే కార్సినోజెన్లు నోటి నుంచి గొంతు, అన్నవాహిక, కడుపు లోకి చేరి చివరిగా రక్తాన్ని కలుషితం చేసి క్యాన్సర్ కలగచేస్తాయి. ఓరో ఫారింక్స్ లో, నాసో ఫారింక్స్ లో, ఓరల్ కేవిటీలో ఎక్కడైనా క్యాన్సర్ వచ్చే అవకాశముంది. ఈ భాగాల్లో ఎక్కడ జన్యుమార్పు జరిగినా విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆహారం తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. సిగరెట్ మానేసిన చాలా కాలానికిగాని ఊపిరితిత్తులు సాధారణ స్థితికి చేరడం అసాధ్యం. కాబట్టి ఆలస్యం చేయక అవకాశామున్నప్పుడే సిగరెట్లకు స్వస్తి పలికితే మంచిది.

Know more: ఊపిరితిత్తుల(లంగ్) క్యాన్సర్ లక్షణాలు, నిర్ధారణ, చికిత్స