ఆహారాన్ని ఎలా వండితే ఆరోగ్యానికి మంచిదో.. మన కంటే మన పూర్వికులకే బాగా తెలుసు ! మనం తినే ఆహారం చేలో ఎంత గొప్పగా పండినా, మన ఇంట్లో కూడా అంతే గొప్పగా వండాలి. నీ ఇంటి దాకా వచ్చిన ధాన్యం వెనక చేసిన వ్యవసాయం ఎంత ముఖ్యమో! నీ నోటి దాకా వచ్చిన అన్నం ముద్ద వెనక వంట కూడా అంతే ముఖ్యం. ఇప్పుడైతే మనం ఈ వెస్టర్న్ ప్రపంచంలో మునిగిపోయి మన ఆరోగ్యానికి హాని చేసే జంక్ మరియు ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ వెనాకాల పడ్డాం కానీ, ఒకప్పుడు మన భారతీయ ఆహారాన్ని సాంప్రదాయ వంట విధానాల వెనక కూడా మన ఆరోగ్యాన్ని పెంపొందించే గొప్ప సైన్స్ ఉండేది.
మనం గమనించని మన వంటింటి హెల్త్ సైన్స్ గురించి ఈరోజు మనం తెలుసుకోవాలి.
ఇది మన బాధ్యత.
ఇప్పటి ఎలక్ట్రిక్, మెకానిక్ కుకింగ్ టెక్నిక్స్ లో మనకు వచ్చే ఆరోగ్యం కన్నా అనారోగ్యమే ఎక్కువ. అందుకే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ రోజు రోజుకీ తగ్గిపోతుంది. సరిగ్గా తింటే చాలు వచ్చే ఆరోగ్యమైన జీవితం కోసం ఇప్పుడు మెడికల్ షాపుల బయట, హాస్పిటల్స్ బయట వరస కడుతున్నాం.
మనకు డయాబెటిస్, బీ పి ఇలా ఎన్నో సమస్యలు వేధిస్తుంటే మన పూర్వీకులకు ఎందుకు డయాబెటిస్ రాలేదు? వాళ్లకు ఎందుకు బ్లడ్ ప్రెజర్ సమస్య లేదు?
దీనికి చాలా కారణాలే ఉన్నాయి, అందులో ఒకటి మన ఆహార విధానం.
మనం చాదస్తమని మరచిపోయిన మన సాంప్రదాయ వంట విధానాల వల్లే ఆ రోజుల్లో డయాబెటిస్ లేదంటే నమ్మగలరా?
ఇది నిజం.
ఈ నిజాన్ని మీరు నమ్మడానికి ఇప్పుడు చెప్పబోయే మన భారతీయ సాంప్రదాయ వంట విధానాల వెనక ఉండే సైన్స్ గురించి తెలుసుకోవాలి. మన ట్రెడిషనల్ కుకింగ్ టెక్నిక్స్ వెనక ఉన్న సైన్స్ ఏంటోఇది
ధాన్యాలను పప్పులను కలిపి వంట చేయడం
కిచిడి అనే పదం మీరు వినే ఉంటారు ! ఈ ఫుడ్ ని పప్పులు మరియు ధాన్యాలు కలిపి వండుతారు. ఇలా చేయడం మన సాంప్రదాయ టెక్నిక్. ఈ కిచిడి లాగానే పొంగల్, దాల్ ధోక్లీ , పుట్టు కాడలా,దాల్ భాటీ, ఇడ్లీ, దోస వంటి ఆహారాల్లో పప్పులు మరియు ధాన్యాలను కలిపి ఉపయోగిస్తారు. ఇక సైంటిఫిక్ రీసర్చ్ చెప్పింది ఏమిటంటే పప్పులు మరియు ధాన్యాలను 3:1 నిష్పత్తి లో కలిపి తిన్నట్లయితే అన్ని ముఖ్యమైన అమీనో యాసిడ్స్ తో కూడిన కంప్లీట్ ప్రోటీన్ మనకు అందుతుందట. అలాగే మన డయాబెటిస్ కి కారణం అయ్యే గ్లైసిమిక్ ఇండెక్స్ ఇలా వండిన ఆహారాలలో తక్కువగా ఉంటుందట.
కిణ్వ ప్రక్రియ
మీకు అర్థం అయ్యేలా చెప్పాలంటే ఈ ప్రక్రియను ఫేర్మెంటేషన్ అంటాం, అంటే పులియబెట్టడం. మన భారతీయ ఆహారాల్లో ఇడ్లీ, దోస, వడ ,పెరుగు, అంబలి వంటివి ఈ ఫేర్మెంటేషన్ చేయబడ్డ ఆహారాలే!
ఇవి మన జీర్ణక్రియ కు సహాయపడే ఎంజైమ్స్ ను తయారుచేసి మన గట్ హెల్త్ ని కాపాడతాయి. వీటిలో ఉండే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా మన ఇమ్మ్యునిటీ ని కూడా పెంచుతుంది. పప్పు ధాన్యాలను ఇలా ఫేర్మెంట్ చేయడం వల్ల వాటిలో ఉండే మనకు హాని చేయగలిగే యాంటీ న్యూట్రియంట్లు కూడా తగ్గుతాయి. అలాగే రాత్రంతా ఇడ్లీ, దోస పిండిని పులియబెట్టడం వల్ల అందులో విటమిన్ బి మరియు సి కూడా పెరుగుతుంది. ఇక పెరుగు మన ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిసిందే కదా !
స్టార్చీ ఫుడ్స్ ని వండి చల్లార్చడం
ఇక మన విధానాల్లో ఉడకబెట్టిన బంగాళా దుంపలు అయినా, అలాగే చిక్కుళ్ళు అయినా చల్లార్చుకొని ఉపయోగించడం అలవాటు. కానీ ఇలా వండి చల్లార్చడం వెనక కూడా సైన్స్ ఉంది. ఇలా చేయడం వల్ల వీటిలో రెట్రోగ్రేడేషన్ అనే ప్రక్రియ జరిగి గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గి రేసిస్టేంట్ స్టార్చ్ టైప్ 3 పెరుగుతుందట. తద్వారా డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. అందుకని అన్నం అయినా, ఉడకబెట్టిన బంగాళాదుంపలైనా, వేరుశనగలైనా చల్లారాక తినడం ఆరోగ్యానికి అంతగా చెడు చేయదు.
నానబెట్టడం
మనం మొక్కల ఆధారిత ఆహారాన్ని తింటున్నప్పుడు, వాటిలో ఉండే యాంటీ న్యూట్రియంట్ల గురించి కూడా తెలుసుకోవాలి. మొక్కలు తమను కాపాడుకోవడానికి లేక్టిన్స్ వంటి టాక్సిన్స్ ను తయారుచేసుకుంటాయి. అలాగే వాటిలో టానిన్స్, ఫైటేట్స్ వంటి యాంటీ న్యూట్రియంట్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి మొక్కలలో ఉండే హానికరమైన టాక్సిన్స్ ని తగ్గించడానికి మన పూర్వికులు వాటిని నానబెట్టేవారు. కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు నానబెట్టడం వల్ల వాటిలో ఆ టాక్సిన్స్ తగ్గిపోయేవి. ఈ నానబెట్టడం అనే పద్దతి కూడా సైన్స్ అనే చెప్పాలి.
ఆవిరికి ఉడికించడం
మన సాంప్రదాయ భారతీయ విధానంలో కొన్ని కూరగాయలను ఆవిరికి ఉడికించేవారు. ఇలా చేయటం ఆ కూరగాయలలో పోషకాలు బయటకు వెళ్ళకుండా కాపడుతుందట. ఈ కూరగాయలలో ఉండే విటమిన్ సి, విటమిన్ బీ కాంప్లెక్స్ మరియు ఫైటోకెమికల్స్ ఆవిరికి ఉడికించడం వాళ్ళ కోల్పోవు. అందువల్ల ఆహారం మరింత పౌష్టికంగా ఉంటుంది.
ఇసుకలో కలిపి వేయించడం
ఇప్పుడైతే మనకు చాలా రకాల ప్రాసెస్డ్ స్నాక్స్ దర్శనం ఇస్తున్నాయి. కానీ మీకు మీ చిన్నతనం లో ఇంట్లో బొరుగులను స్నాక్స్ గా తిన్న రోజులు గుర్తున్నాయా? ఈ బోరుగులని పఫ్డ్ రైస్ అంటారు, వీటిని అధిక వేడిలో ఇసుకలో కలిపి రోస్ట్ చేస్తారు. ఇది కూడా మన పూర్వీకుల నుండి వచ్చిన అలవాటే. ఇలా చేయడం వల్ల వాటిలో కార్బోహైడ్రేట్ మరియు ప్రోటీన్ మనకు సులభంగా జీర్ణం అయ్యేలా మారుతుందట. అలాగే ఈ ప్రాసెస్ వాటిలో ఫైబర్ శాతాన్ని పెంచుతుందట. ఇది మన పూర్వికులు బియ్యం, గోధుమలు. మొక్కజొన్న వంటి వాటికి చేసేవారు. ఇలా చేయటం వల్ల ఆ ధాన్యంఎక్కువ కాలం నిలువ ఉంటుందట.
మొలకెత్తిన విత్తనాలు
మొలకెత్తిన విత్తనాలను తినడం ఈ మధ్య మనం ఆరోగ్యం కోసం పాటించడం మొదలు పెట్టాం కాని ఈ అలవాటు ఎప్పటినుండో ఉంది. ఇలా మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల ఆ విత్తనాలలో విటమిన్ సి మరియు విటమిన్ బి ఇంకొంచెం పెరుగుతుందట. అంతేకాకుండా వాటిలో ఉండే హానికర ఫైటిక్ యాసిడ్ తగ్గి, మనకు విటమిన్ ఎ మరియు అబ్జర్బ్ అవ్వడంలో సహాయపడతాయి. ఇది ఇప్పుడే వచ్చిన ఫ్యాషన్ అయితే కాదు. ఎప్పట్నుండో ఆచరిస్తున్న విధానం.
మట్టి పాత్రలలో వంట
మన పూర్వకాలంలో మట్టి పాత్రలు, ఇనుముతో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగించేవారు. ఇవి ఉపయోగించడం మన హెల్త్ కి మంచి చేస్తుంది. మట్టి పాత్రలలో వంట చేయడం వలన ఆహారం నిదానంగా ఎటువంటి పోషకాలు కోల్పోకుండాతయారవుతుంది. అలాగే ఈ పాత్రలు ఉపయోగించడం వాళ్ళ కూడా కొన్ని పోషకాలు మనకు అదనంగా అందుతాయి, ఇంకా వీటిలో వండటానికి తక్కువ నూనె అవసరం పడుతుంది. ఇక ఇనుము పాత్రలలో చేసిన వంట తినడం వల్ల ఐరన్ లోపం తగ్గుతుందని పరిశోధనలు కూడా చెబుతున్నాయి మరి. మన పూర్వికులే కరెక్ట్ కదా !
ఇవి మాత్రమే కాదు అరటి ఆకులో భోజనం చేయడం, అర చేతిని తినడానికి ఉపయోగించడం, రాత్రి నుండి ఫేర్మేంటేషన్ అయిన చద్ది అన్నాన్ని ఉదయమే తినడం..
ఇలా ప్రతీ అలవాటు వెనక సైన్స్ ఉంది. వాళ్ళ అలవాట్లతో పోలిస్తే మనమే అనాగరికులమేమో!
ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం. మన సాంప్రదాయ విధానాలలోని మంచిని గ్రహించి ఆచరిద్దాం.
ఆరోగ్యంగా జీవిద్దాం. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి పునర్జన్ ఆయుర్వేద బ్లాగ్ ను ఫాలో అవ్వండి.
Also Read: ఆర్గానిక్ ఫుడ్స్ అసలు అర్థం ఏంటి?