క్యాన్సర్ పై ప్రభావం చూపే ‘ఆర్ట్ థెరపీ’

You are currently viewing క్యాన్సర్ పై ప్రభావం చూపే ‘ఆర్ట్ థెరపీ’

ఈ భూమ్మీద మనిషికి మాత్రమే ఉన్న గొప్ప వరం ‘కళ ‘.

కళ అనేది మనిషి భావోద్వేగాలను వ్యక్తపరిచే ఒక సాధనం. మనిషి తన ఆనందాన్ని బాధను మాత్రమే కాకుండా బయటకురాని చెప్పలేని ఎన్నో క్లిష్టమైన భావోద్వేగాలను కూడా కళ ద్వారా బయటకు తీయగలడు. లోపలే దాగి ఉన్న బరువైన ఆలోచనలైనా, అర్థంచేసుకోలేని మనుషుల మధ్యలో జీవించే జీవితం తాలూకు భారమైనా, వర్ణించలేని శారీరక బాధైనా కళ ద్వారా బయటకు రాగలదు, ఆ మనిషి జీవితంలోని భారాన్ని దించి తేలిక చేయగలదు. అయినా ప్రపంచంలో ఎందరో మంది పీడకలగా భావించే క్యాన్సర్ కు కళ సంబంధమేంటి అని ఆలోచిస్తున్నారా?

సమాధానంగా ఈ అక్షరాలు మీకు అర్థమయ్యేలా చెప్పబోతున్నాయి. పూర్తిగా చదవండి.

‘ 2017లో  వియెత్నాం అనే దేశంలో డెబ్బై మూడేళ్ళ నెడ్ అనే ఒక రిటైర్డ్ పోస్టల్ వర్కర్ ఉండేవాడు, ఆయనకు ఒక అరుదైన బ్లడ్ క్యాన్సర్ వ్యాధి ఉందని నిర్ధారించబడింది. ఈ క్యాన్సర్ రావటం వల్ల బ్లడ్ స్టెమ్ సెల్స్ అనేవి కొత్త బ్లడ్ స్టెమ్ సెల్స్ ను తయారు చేసుకోలేవు. ఉన్న ఒకే ఒక మార్గం ‘బ్లడ్ స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్’. కానీ ఈయనకు జెనిటిక్ బ్లడ్ డిజార్దర్ ఉండటం వల్ల ఇది పనిచేసే అవకాశం కూడా తక్కువ. కానీ నమ్మకం కోల్పోకుండా చికిత్సను కొనసాగించాడు. చికిత్స జరిగే క్రమంలో నొప్పి, బాధ, ఆందోళన, డిప్రెషన్ ఇలా ఎన్నో మానసిక మరియు శారీరక సవాళ్ళను ఎదుర్కున్నాడు. అలాంటి సమయంలో నెడ్ ఆంబర్ అనే ఒక ఆర్ట్ తెరపిస్ట్ ని కలిసాడు. ఆర్ట్ థెరపీ చికిత్స పూర్తయ్యేదాకా కొనసాగించాడు. చివరికి కోలుకున్నాడు.’

కానీ కోలుకున్న తరువాత నెడ్ మాట్లాడుతూ ‘నేను ఆర్ట్ ఎప్పుడూ ట్రై చేయలేదు, కానీ ఈ ఆర్ట్ థెరపీ నన్ను ప్రస్తుత బాధాకరమైన  పరిస్థితుల నుండి బయటకు తీసుకువచ్చింది. ఈ ఆర్ట్ థెరపీ ని నేను డిస్కవర్ చేయకుండా ఉంటే నా ప్రయాణం ఇలా ఉండేది కాదేమో..’ అన్నాడు.

ఇంతే కథ. ఆర్ట్ థెరపీ పనితీరుకు ఇదొక ఉదాహరణ.

క్యాన్సర్ పై ఆర్ట్ థెరపీ 

 

క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంది. అందుకే క్యాన్సర్ అనగానే అందరిలో తెలియని ఎదో భయం. ఇన్ని చికిత్సలు ఉన్నా, ఇంకా క్యాన్సర్ పై భయం పోలేదు. అదే భయం క్యాన్సర్ వచ్చిన వారిలో ఇంకెంత ఉంటుంది? ఊహించగలరా.. 

క్యాన్సర్ శారీరకంగానే కాకుండా మానసికంగా ఎన్నో కాంప్లెక్స్ ఎమోషన్స్ ను డీల్ చేసే సవాలు ను మనిషి పై విసురుతుంది. అలాంటి సవాళ్ళకు సమాధానం ఆర్ట్ థెరపీ ఇచ్చింది.

క్యాన్సర్ పేషెంట్ చేతిలో పెయింట్ బ్రష్ అనేది ఒక మంత్రదండం లాంటిది. అది తనలోని భయాలను, బాధను బయటకు తీసి ఒక తెల్లటి ప్రాణం లేని క్యాన్వాస్ పైకి తీసుకురావటానికి సహాయం చేస్తుంది. తన లోని ఎన్నో కాంప్లెక్స్ భావొద్వెగాలను తెల్లని కాగితంపై గీసి తన మనసుపై ఉన్న  భారాన్ని  తగ్గించుకుంటాడు. కొన్ని సార్లు మాటలు సరిపోవు కదా..

ఆర్ట్ థెరపీ అనేది ఫోకస్ కోల్పోయిన క్యాన్సర్ పేషెంట్స్ కి ఒక పని పైన ఫోకస్ చేయడానికి సహాయపడుతుంది. తన జీవితంలో ఆప్షన్స్ ఎంచుకోలేకపోతున్నాననే బాధను తగ్గించి తన ముందున్న రంగులను ఎంచుకునేలా ధైర్యాన్నిస్తుంది. తనలోని ఒత్తిడిని తగ్గించి, నొప్పితో పోరాడే గుణాన్ని బలోపేతం చేసి, తన ఆరోగ్యాన్ని మళ్ళీ తనకే బహుమతిగా ఇస్తుంది.

ఆర్ట్ థెరపీలో పాల్గొనాలంటే ఎలాంటి స్కిల్ ఉండాల్సిన అవసరం లేదు, ఆర్టిస్ట్ అవ్వాలని రూల్ లేదు. ఇది ఎవరికో నచ్చాలనిమనిషి చేసే పని కాదు తనకు తాను నచ్చడానికి చేసే పని. ఇక్కడ గమ్యం ముఖ్యం కాదు ప్రయాణం ముఖ్యం.

ఆర్ట్ థెరపీ అంటే ఏంటి?

మనిషి ఏదైనా కళను నిస్వార్థంగా  ప్రదర్శించినప్పుడు తనలోని భావాలకు ఆ కళ ప్రతిబింబంలా మారుతుంది. అది తనను తాను అర్థం చేసుకోవటానికి, తనను తాను బాగుచేసుకోవటానికి సహాయపడుతుంది.

ఆర్ట్ థెరపీ అనేది పేషెంట్ కి ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే ప్రక్రియ. ఆర్ట్ థెరపీ చేయటానికి ప్రత్యెక ఆర్ట్ థెరపిస్ట్ ఉంటారు. వారు విజువల్ ఆర్ట్స్ ని ఉపయోగించి ఆర్ట్ థెరపీ లో పేషెంట్స్ ను గైడ్ చేస్తారు. వారి దృష్టిలో ఆర్ట్ థెరపీ అంటే అందమైన ఆర్ట్ క్రియేట్ చేయటం కాదు, క్రియేట్ చేసే ప్రాసెస్ లో పేషెంట్స్ తమ భయాల్ని బాధలను పోగొట్టుకునేలా చేయటం.

ఆర్ట్ థెరపీ పై అపోహలు-నిజాలు 

ఆర్ట్ థెరపీ పై సమాజంలో కొన్ని అపోహలు ఉన్నాయి, వాటి వెనక నిజాలను తెలుసుకోవటం ఆర్ట్ థెరపీ పై అవగాహన పెంచుకోవటానికి సహాయపడుతుంది.

  • కొందరికి ఆర్ట్ థెరపీ అంటే ఆర్టిస్ట్ మాత్రమె అందులో పాల్గొనగలడు అనే ఒక అపోహ ఉంది. కానీ నిజానికి ఆర్ట్ థెరపీకి స్కిల్ తో పని లేదు.
  • కొందరు ఆర్ట్ థెరపీ అంటే పిల్లలకు మాత్రమే అనే అపోహ ఉంది, తారే జమీన్ పర్ సినిమా లాగా..కానీ కళకు వయసుతో సంబంధం లేదు. ఏ వయసు వారికైనా ఇది మంచిదే.
  • మరికొందరు ఆర్ట్ థెరపిస్ట్ అంటే ఆర్ట్ నేర్పించే టీచర్ లాగానే అనుకుంటారు. కానీ అది ప్రత్యేకమైన ట్రైనింగ్. సైకాలజీ మరియు హీలింగ్ ప్రాక్టిస్ ఇలా ఎన్నో చదివి, ఎన్నో రోజులు ప్రాక్టీస్ చేస్తేనే ఆర్ట్ థెరపిస్ట్ అవ్వగలరు.
  • మరో అపోహ ఏంటంటే ఇదంతా ట్రాష్, అసలు ఇది పని చేయదు అంటుంటారు కొందరు. ఆర్ట్ అనేది మనిషి ఎమోషన్స్ ను మార్చగలదు అనేది ఇప్పటి నిజం కాదు. ఒక మంచి సినిమా చూస్తేనే కొన్ని రోజులు మన మైండ్ లో ఆ ఇంపాక్ట్ ఉంటుంది కదా..అందువల్ల నమ్మితే ఆర్ట్ థెరపీ బాగా  పని చేస్తుంది.

ఆర్ట్ థెరపీ పనితీరు గురించి అధ్యాయనాలు 

 ఆర్ట్ థెరపీ అనేది భావోద్వేగాలను బ్యాలెన్స్ చేసే ఉత్తమ మార్గాలలో ఒకటి. శాస్త్రవేత్తలు ఆర్ట్ థెరపీ మానసిక లాభాలను ఎన్నో అధ్యయనాల్లో వివరించారు. కళా రూపాలు మానవ మెదడు యొక్క అనుభూతి శక్తి ప్రదేశాలను ప్రేరేపిస్తాయి. దాని వల్ల, ఇది ఆలోచనా విధానాన్ని మెరుగుపరుస్తుంది అలాగే మెదడులో కొత్త ఆలోచనలను అభివృద్ధి చేస్తుంది. ఇది ఆలోచించే కొత్త మార్గాలను సృష్టిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఇంకా ప్రస్తుత పరిస్థితిలో శాంతిని పొందడానికి సహాయపడుతుంది. 

  • శాస్త్రవేత్తలు ఆర్ట్ థెరపీ వివిధ మానసిక రుగ్మతలను తగ్గించడానికి సహాయపడుతుందని చెప్పారు. ఇది డిప్రెషన్, ఆందోళన, PTSD, హైపర్ టెన్షన్ మొదలైన వాటితో బాధపడే వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. క్యాన్సర్ వంటి నయం కాని వ్యాధులను కూడా కొంతవరకు సహాయపడుతుందని కొందరు నిపుణులు అంటున్నారు.
  • ఒక అధ్యాయనం ప్రకారం, 39 మంది నలభై ఐదు నిమిషాల ఆర్ట్ థెరపీ సెషన్ లో పాల్గొంటే వాళ్ళ శరీరంలో 75 శాతం స్ట్రెస్ ను కలిగించే కార్తిసోల్ హార్మోన్ విడుదల అవ్వటం తగ్గింది.
  • బ్రెజిల్ లో ఇరవై వారాల ఆర్ట్ థెరపీ గ్రూప్ సెషన్స్ లో పాల్గొన్న వారిలో డిప్రెషన్ మరియు ఆందోళన లక్షణాలు తగ్గినట్లు గుర్తించారు.
  • మరొక అధ్యయనం లో బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యకు రేడియోథెరపీ తీసుకున్న ఇరవై మంది మహిళలకు ఐదు వారాల ఆర్ట్ థెరపీ సెషన్స్ తరువాత డిప్రెషన్, ఆందోళన తగ్గాయని  అలాగే నొప్పికి రెస్పాండ్ అయ్యే విధానం మారిందని పేర్కొన్నారు.

 

ఆయుర్వేదం మరియు ఆర్ట్ థెరపీ 

 

ఆయుర్వేదంలో ఉన్న మూడు దోషాలు కూడా క్రియేటివిటీ గురించి చెబుతాయి. వాత, పిత్త, కఫ అనే మూడు దోషాలకు ఒక్కో విభిన్నమైన సృజనాత్మకత కు సంబంధించిన లక్షణం కలిగి ఉంది. సాధారనంగా వాత దోషం ఆధిపత్యం గలవారిలో మంచి ఊహాత్మకమైన ఫ్రీ ఫ్లోయింగ్ క్రియేటివిటీ ఉంటుంది. పెయింటింగ్ ద్వారా లేదా రచనల ద్వారా  వారి ఆలోచనలను బయటపెట్టగలరు. అలాగే పిత్త దోషం ఆధిపత్యం లో ఉన్న వారు షార్ప్ గా ప్రేసైజ్ గా వారి క్రియేటివిటీ ని చూపిస్తారు. ఇంకా కఫ దోషం వారు ఓపికగా ఉంటూ వారి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ని వివిధ విధానాల్లో తెలియజేస్తారు. అలా ఒక్కొక్కరికీ వారిలోని భావాలను పూర్తిగా బయట పెట్టడానికి కళ అవసరమవుతుంది.

ఆయుర్వేదం కూడా సంపూర్ణ శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తుంది. ఆయుర్వేద వైద్యం ఔషధాలు ప్రక్రియలు మరియు చికిత్సా విధానాల ద్వారా క్యాన్సర్ పై శారీరకంగా మానసికంగా ప్రభావం చూపగలదు. ఆర్ట్ థెరపీ ఆయుర్వేద వైద్యానికి తోడుగా నిలవగలదు.

చివరిగా:

ఆర్ట్ థెరపీ అనేది ఎన్నో మానసిక సమస్యల్లో మనిషికి ఉపశమనం కలిగించింది. క్యాన్సర్ బాధితుల్లో కూడా మానసికంగా ధృడత్వాన్ని పెంచి క్యాన్సర్ చికిత్స పట్ల పాజిటివిటీని కల్పించగలదు. అలాగే క్యాన్సర్ సర్వైవర్స్ కూడా ఆర్ట్ థెరపీ ద్వారా వారు క్యాన్సర్ చికిత్స ప్రయాణంలో అనుభవించిన ట్రామా తాలూకు జ్ఞాపకాలు చేసే ఇబ్బందిని తగ్గించుకోవచ్చు. కళ సమస్యలను పూర్తిగా తొలగించకపోవచ్చు, కానీ పోరాడే ధైర్యాన్ని మాత్రం ఇవ్వగలదు.

Also read: ఆల్కలీన్ వాటర్ క్యాన్సర్ ని ఎదుర్కోవడంలో ఎలా సహాయపడుతుంది