పిల్లలకు పంచాల్సింది ఆస్తులు, ఆరోగ్య సమస్యలు కాదు !
సరైన జీవనవిధానంపై జ్ఞానం…
మన దేశంలో ఇప్పుడు నూట ఒక్క మిలియన్ జనాభా మధుమేహంతో బాధపడుతున్నారు,
మూడువందల పదిహేను మిలియన్ల జనాభా బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నారు,
రెండువందల యాభై మిలియన్ల జనాభా కంటే ఎక్కువే ఊబకాయంతో బాధపడుతున్నారు,
ప్రతీ తొమ్మిది మందిలో ఒక్కరికి జీవితంలో క్యాన్సర్ రిస్క్ ఉంది.
కానీ ఇంత మాడర్న్ నాగరికత మనకు ఇవ్వాల్సింది సమస్యలు లేని ప్రపంచాన్ని కదా!
మరి ప్రతీ రోజూ మనిషి జీవితపు నాణ్యత పడిపోతుండటం ఏంటి?
ఎప్పుడైనా ఆలోచించారా?
ఈ ప్రపంచంలో కాలంతో పాటూ పరిగెత్తడం మరచిపోయి, కాలాన్ని దాటి వేగం పెంచి పరుగులు తీయటం అలవాటైన ఈ మాడర్న్ మనుషులైన మనం,
ఒక సారి మన గురించి ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది.
మనం మన అలవాట్లతో మన ఆరోగ్యాలను,
మన తరవాతి తరం భవిష్యత్తును ఎలా ఊబిలోకి నేడుతున్నామో ఇప్పుడు తెలుసుకుందాం.
మనందరికీ ఆరోగ్యంగా ఉండాలనే ఉంటుంది, అందుకే హెల్త్ విషయంలో ఏ సమస్య వచ్చినా పర్లేదు అని ఇంటిపట్టున కూర్చోకుండా డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుని వెళుతున్నాం. ఇప్పుడైతే పిలిస్తే పలికెంత దూరంలో వైద్యుడు ఉన్నాడు, నాలుగు అడుగులు వేస్తె చాలు మందులు దొరుకుతున్నాయ్. వెళుతున్నాం.. ఆ మందులు వేస్కున్తున్నాం.. రోజులు గడిపెస్తున్నాం!
మనలో చాలా మంది దినచర్య ఇదే.. చాలా మందికి వయసు యాభై దాటితే మందు బిళ్ళ లేనిదే ఆ పూట కూడా గడవట్లేదు. ఇది నిజమే కదా..
సరైన వైద్యం దొరికితే చాలనుకునే మనం ఎందుకు మందులు అవసరం లేని జీవితం కోరుకోవట్లేదు ?
ఒక్క సారి మన ఆరోగ్య సమస్యలకు కారణమేంటో ఆలోచిద్దామా!
సింపుల్ గా మన జీవితంలో మారినవి రెండే విషయాలు ఒకటి డైట్, రెండు హ్యాబిట్స్.
90 శాతం ఇప్పుడు వస్తున్న ఆరోగ్య సమస్యలకు కారణం కూడా ఆ రెండే..
ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడదాం !
మనలో చాలా మందికి తెలుసు షుగర్ మంచిది కాదు అని, అతిగా తింటే ఊబకాయం వస్తుందని, అది ఎన్నో సమస్యలకు దారి తీస్తుందని..
అయినా సరే.. రిఫైన్డ్ షుగర్ తింటూనే ఉన్నాం, మన పిల్లలకు కూడా పెడుతున్నాం.
మనకు క్లియర్ గా తెలుసు రిఫైన్డ్ నూనెలు ఆరోగ్య సమస్యలకు కారణమని..
తెలిసినా, కనీసం మోతాదు కూడా తగ్గించకుండా ఉపయోగిస్తున్నాం.మన పిల్లలకు ఇష్టంగా ఆయిల్ ఫుడ్స్ పెడుతున్నాం.
పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యానికి అతి ముఖ్యమైనవని తెలిసినా మనం వాటిని ఇంకా అరుదుగా తినే వాటిలా భావిస్తూ నెలకు ఒకసారి భుజిస్తూ, మన హెల్త్ చెడిపోవడానికి కారణమయ్యే బయట దొరికే ప్రాసెస్ చేసిన ప్యాకేజ్డ్ ఫుడ్స్ ని మాత్రం రోజూ దగ్గరుండి పిల్లలకు కొనిస్తున్నాం, వాళ్ళతో కలిసి కూర్చొని తింటున్నాం.
ఇంట్లో స్వచ్చంగా వండుకొని తినే ఆహారమే ఆరోగ్యమని తెలిసినా, మనమే మన పిల్లలను బయటికి తీసుకెళ్ళి జంక్ ఫుడ్ అలవాటు చేస్తున్నాం, వాళ్ళతో పాటే తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూనే ఉన్నాం. అవును కదా !
ఒకప్పుడు టీవీ చూడడానికే పది అడుగుల దూరం కూర్చోమని మన పెద్దలు చెప్పేవారు, ఇప్పుడు పిల్లలు తమ సెల్ఫోన్ ని పది సెంటీమీటర్ల దూరం కూడా లేకుండా చూస్తున్నారు. అప్పట్లో పెద్దల మాట విని వెనక్కి జరిగి కూర్చున్న మనం, ఇప్పుడు పిల్లల చేతిలో ఫోన్ లాక్కోలేకపోతున్నాం..
వాళ్ళ కళ్ళకు కళ్ళజోడును చిన్నప్పుడే తగిలించేస్తున్నాం. నిజం కాదంటారా?
ఎంతదూరమైనా నడుస్తూ వెళ్ళే పరిస్థితి నుండి, ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెడితే, రెండు ఫ్లోర్ లు దిగి వాడి చేతిలో ఆ ఫుడ్ తీసుకునే ఓపిక, బలం లేని స్థాయికి మనం వచ్చేసాం., మన పిల్లలను కూడా తెచ్చేసాం..
మన ఆరొగ్యాన్ని మన చేతులారా నాశనం చేసుకుంటూ.. మనం నేర్పే ఈ చెడు అలవాట్ల వల్ల మన పిల్లల ఆరోగ్యాలను కూడా చెడగోడుతున్నాం.
కాదని అనగలరా?
ఇక్కడ మారింది రెండే.. హ్యాబిట్స్.. డైట్..
ఇవి కలిపితే లైఫ్ స్టైల్.
అంటే మన జీవన విధానం..
మన జీవన విధానం మంచిదైతే మన ఆరోగ్యం మంచిదవుతుంది,
అదే జీవన విధానం మన పిల్లలకు అలవాటవుతుంది,
అదే అలవాటు మన రేపటి తరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇది మనందరికీ తెలుసు..కానీ పాటించట్లేదు.
మద్యం సేవించడం, ధూమపానం చేయటం ఆరోగ్యానికి ఎంత హానికరమో..
మంచి చెడులు పిల్లలకు నేర్పకపోవటం, చెడుకి ఉదాహరణగా పిల్లల ముందు తల్లి దండ్రులు ఉండటం కూడా మీ పిల్లల జీవితానికి అంతే హానికరం.
ఈ విషయాన్ని గుర్తుంచుకోండి..
మంచి మాట మీ పిల్లల చెవి దాకే వెళుతుంది,
కానీ మీరు నేర్పే మంచి జీవన విధానం వాళ్ళకు మంచి భవిష్యత్తును వాళ్లకు ఇస్తుంది.
మరో విషయం..
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు ఆరోగ్యంగా ఉండాల్సింది మన ప్రకృతి.
ఇది వరకు మనం చెప్పుకున్న తప్పులు మనకు, మన పిల్లలకే నష్టమైతే, మనం చేసే ఈ తప్పులు మన తరువాతి పది తరాలకు ముప్పే ! ఇప్పుడు మనం పీల్చే గాలి కలుషితం, మనం తాగే నీరు కలుషితం, మనం తినే తిండి కలుషితం, మన వినే శబ్దం, ఆలోచించే ఆలోచన అన్ని కలుషితమే ! కాదనగలరా ?
ఎక్కడ తప్పు చేస్తున్నామో మనకు తెలుసు.
ఎం మార్చుకోవాలో మనకు తెలుసు.
ఈ విడియో మనందరి తప్పుల చిట్టా కాదు, మన తప్పులను సరిదిద్దుకునే అవకాశం మనకుంది అని చెప్పే ఒక అలారం.. అంతే!
ఇక మనందరి ఆరోగ్యం కోసం..
మన తరువాతి తరం ఆరోగ్యం కోసం..
మన ప్రకృతి కోసం మనం మారాల్సిన సమయం వచ్చింది. ఇప్పటికీ మారకపోతే
మనం మన రేపటి సమాజాన్ని ఇళ్ళలో కాకుండా హాస్పిటల్స్ లో కలుసుకోవాల్సి వస్తుంది.
ఇకనైనా మేలుకుందాం..
ఆయుర్వేదం చెప్పిన ప్రకృతి నియమాలను అనుసరించి మన జీవన విధానాన్ని మలచుకుందాం.
ఇదే మన నూతన సంవత్సర సంకల్పంగా భావిద్దాం. అందరం ఆరోగ్యంగా, ఆనందంగా జీవిద్దాం.
మన కోసం, మన తరువాతి తరం కోసం, ఈ ప్రకృతి కోసం మనం మన జీవనవిధానాన్ని మార్చుకోగలిగితే అదే మనకు “పునర్జన్మ”.
Disclaimer:
This information on this article is not intended to be a substitute for professional medical advice, diagnosis, treatment, or standard medicines. All content on this site contained through this Website is for general information purposes only.