ఉప్పు మన జీవితంలో ఎప్పుడూ ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అసలు ఉప్పు లేకుంటే ఆహారానికి రుచే లేదు, కానీ ఆ ఉప్పు స్పెషల్ గా తినాలని మనకు కోరిక కలగదు. ఈ ఉప్పు మనకు ఆరోగ్యానికి కూడా చాలా అవసరం కూడా, కానీ ఇప్పుడు చూస్తే ఉప్పును ముప్పు అంటున్నాం, అతిగా తింటే తప్పు అంటున్నాం, ఉప్పు వల్లే మన ఆరోగ్య సమస్యల జాబితా పెరుగుతుంది అంటున్నాం. నిజానికి మన లాలాజలం లో 0.4 శాతం ఉప్పు ఉంటుందట, అందుకే మనం తినే ఆహార పదార్థంలో ఉప్పు శాతం 0.4 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఆ రుచిని మనం ఆస్వాదించగలమట.
సరే ! ఇక విషయానికి వచ్చేద్దాం, ఇప్పుడు మనందరం అన్-హేల్తీ అని ముద్ర వేసిన ఉప్పును,
ఆయుర్వేదం ప్రకారం హెల్త్ కోసం ఎలా ఉపయోగించేవారు అనేది మనం తెలుసుకోవడానికే ఇదంతా!
అసలు ఉప్పు కథేంటి?
ఆయుర్వేదంలో ఉప్పు గురించి ఎం చెప్పబడింది ?
ఇప్పుడు ఉప్పు మనకు ముప్పు అని ఎందుకు అంటున్నాం?
ఇలా అన్ని ప్రశ్నలకూ సమాధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్పు..రుచి ఒక్కటే ! కానీ పదార్థాలెన్నో..
ఉప్పగా ఉండే పదార్థాలను మనం ఉప్పులు అంటున్నాం!
ఉప్పులు ఏంటీ, ఉన్నది ఒక్క ఉప్పే కదా అంటారా! అక్కడే మీరు పొరబడ్డారు.
ఇప్పుడు మనందరం తినే ఉప్పును ‘ సముద్ర లవణం’ అంటారని ఆయుర్వేదంలో రాయబడింది. కానీ మనం తినే సముద్ర లవణం ప్రాసెస్ చేయబడినది. ఈ సముద్ర లవణం అనేది ఆయుర్వేదం చెప్పిన ఎన్నో రకాల ఉప్పులలో ఒకటి మాత్రమే ! ఇంకా సైంధవ లవణం, బిడా లవణం.. ఇలా చాలానే రకాల ఉప్పులు ఉన్నాయి.
ఆయుర్వేదం అనేది మనం పొందిన ఒక అధ్బుత జ్ఞాన సంపద. ఈ ఆయుర్వేదంలోని రస శాస్త్రం ప్రకారం ఉప్పును పంచ లవణాలు అని ఐదు రకాలు గా విభజించారు. అవే సైంధవ లవణం, సముద్ర లవణం బిడా లవణం, సౌవర్చ లవణం, రోమక లవణం . వీటిలో సైంధవ లవణాన్ని అన్నిటికంటే శ్రేష్ఠమైనదిగా పేర్కొన్నారు. వీటితో పాటు కాచ లవణం, ఔద్బిధ లవణం, చుల్లిక లవణం వంటివి కూడా ఆయుర్వేద గ్రంధాలలో పేర్కొనబడ్డాయి.
ఇప్పుడు మనం తినే ఉప్పు ను కెమికల్ పేరు తో పిలవాలంటే ‘ సోడియం క్లోరైడ్’ అంటాం అని అందరికీ తెలిసిన విషయమే. ఆమ్లానికీ క్షారానికీ జరిగిన రియాక్షన్ కి వచ్చిన ఉత్పత్తి ఇప్పుడు మనం తినే ఈ సాల్ట్ .
ఇక ఈ ఉప్పు తెస్తున్న ముప్పు గురించి తెలుసుకునే ముందు, ఆయుర్వేదం లోని రస శాస్త్రం చెప్పిన పంచ లవణాల గురించి తెలుసుకోవాలి. కానీ దానికంటే ముందు ఉప్పు మనకు ఎందుకు అవసరం అనేది కూడా మనం తెలుసుకోవాలి.
ఉప్పు మనకు ఎందుకు అవసరం?
ఉప్పు మన శరీరానికి మితంగా అందటం అవసరం.
ఈ ఉప్పును మనిషి తయారుచేయకముందు పండ్ల నుండి. మాంసం నుండి ఉప్పును గ్రహించేవాడు.మనం మితంగా ఉప్పు తింటే మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉంది, ఆకలి సవ్యంగా అవుతుంది. మనం ఆహారం తిన్న తరువాత వాటిని విడదీసే పని ఉప్పు చేస్తుందని ఆయుర్వేదం లో చెప్పబడింది. మనం తిన్న ఆహారంలో మన శరీరానికి కావలసిన దానిని మరియు అవసరం లేని దానిని విడదీసి, అవసరం లేనిది బయటికి ఉప్పు పంపించగలదట. ఇక దోషాలలో కూడా వాతాన్ని, కఫాన్ని తగ్గించే గుణం ఉప్పుకు ఉంటుంది. అలాగే ఉప్పును ప్రేగులోపల ఉండే విషం బయటకు కక్కించడానికి కూడా ఉపయోగిస్తారు. మన శరీరంలోని నరాలకు, కండరాలకు కూడా సరైన తీరుకోసం కాస్త సోడియం అవసరమే, అది ఉప్పు ద్వారా మనకు అందుతుంది. అందుకని ఉప్పు మితంగా తినడం మనకు అవసరం.
రసశాస్త్రంలోని పంచ లవణాలు
ఆయుర్వేదంలో రస శాస్త్రం ఐదు రకాల ఉప్పులను పంచ లవణాలు గా పేర్కొంది.
వాటి గురించి వివరంగా చెప్పాలంటే..
సైంధవ లవణం
సైంధవ లవణం అనేది అన్ని రకాల ఉప్పులలో ఉత్తమమైనది, దీనినే మనం రాక్ సాల్ట్ కానీ హిమాలయన్ పింక్ సాల్ట్ అని అంటాం.ఈ సైంధవ లవణం సహజంగా ఒకప్పటి పంజాబ్ రాష్ట్రానికి పడమరన ఉన్న గనుల నుండి లభ్యమయ్యేది. సైంధవ లవణం తెలుపు మరియు ఎరుపు అనే రెండు రకాలుగా లభిస్తుంది. చరకుడు చెప్పిన దాని ప్రకారం, మన ఆహారంలో కూడా ఈ సైంధవ లవణం ఉండటం మనకు మంచిది. ఈ రకమైన ఉప్పులో 97.6 శాతం సోడియం క్లోరైడ్ ఉంటుంది, దానితో పాటూ సోడియం బైకార్బోనేట్, క్యాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, క్యాల్షియం సల్ఫేట్ ఇందులో ఉంటాయి.
ఈ సైంధవ లవణాన్ని మితంగా తీసుకుంటే మనకు వచ్చే లాభాలేంటంటే, జీర్ణ శక్తి పెరుగుతుంది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా మంచి చేస్తుంది. ఇంకా కీళ్ళ సమస్యల్లో, శ్వాస సంబంధిత సమస్యల్లో ఔషధాలతో పాటూ ఈ సైంధవ లవణాన్ని కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఈ లవణం త్రిదోషాలను సమతుల్యం చేయగలిగే లక్షణాలను కూడా కలిగి ఉండటం విశేషం.
బిడా లవణం
బిడా లవణాన్ని కెమికల్ భాషలో చెప్పాలంటే ‘అమోనియం సాల్ట్’ అనవచ్చు. ఆయుర్వేదం ప్రకారం ఇది సహజంగా ఏర్పడే ఉప్పు కాదు, దీనిని కృత్రిమంగా దక్షిణ భారతదేశంలో తయారు చేసేవారు. దానికోసం కొన్ని రకాల జంతువుల వ్యర్థాలను, మట్టి మరియు చెక్కను కాల్చేవారు. అలాగే రస తరంగిణి అనే గ్రంధం ప్రకారం 920 గ్రాముల రోమక లవణాన్ని,120 గ్రాముల ఆమ్లాకి చూర్ణాన్ని మట్టి కుండలో పెట్టి ఆరు గంటలు కాల్చి ఈ బిడా లవణాన్ని తయారు చేసే వారట. ఈ ఉప్పులో దాదాపు 94 శాతం సోడియం క్లోరైడ్ ఉంటే మిగతా భాగం సల్ఫైడ్ మరియు ఐరన్ ఉంటుంది.
ఈ బిడా లవణం వేడి స్వభావం తో ఉంటుంది. పిత్త దోషాన్ని పెంచడంలో, వాత దోషాన్ని తగ్గించడంలో ఈ లవణం పనిచేస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగు పరచడంలో కూడా ఈ బిడా లవణం సహాయపడుతుందట. ఈ బిడా లవణాన్ని విడా లవణం అని కూడా అంటారు.
సౌవర్చల లవణం
ఈ సౌవర్చల లవణాన్ని కెమికల్ భాషలో ‘ ఉనాక్వా సోడియం క్లోరైడ్’ అంటారు.
దీనినే ‘ కాలా నమక్’ అని కూడా పిలుస్తారు. చరకుడు చెప్పిన దాని ప్రకారం సహజంగా ఏర్పడిన సౌవర్చల లవణానికి ఎటువంటి వాసన ఉండదు, అదే కృత్రిమంగా చేయబడితే దానికి వాసన ఉంటుంది. హిమాలయా దగ్గర కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఇది సహజంగా లభిస్తుంది. అలాగే సైంధవ లవణాన్ని మరో రకమైన సార్జిక క్షారంతో కలిపి కృత్రిమంగా కూడా దీనిని తాయారు చేస్తారు. ఈ సౌవర్చల లవణంలో 98 శాతం సోడియం క్లోరైడ్ ఉంటే, మిగతా భాగంలో సల్ఫైడ్ మరియు ఐరన్ ఉంటుంది. చూడటానికి నల్లగా ఉంటుంది కాబట్టి దీనిని ‘ బ్లాక్ సాల్ట్’ అని అంటుంటారు.
ఈ సౌవర్చల లవణాన్ని ఆయుర్వేద ఔషధాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. జ్వరాన్ని, అజీర్ణాన్ని తగ్గించే అగ్నితుండి వటిలో,ఆస్తమా వంటి సమస్యలకు ఉపయోగించే చంద్రప్రభ వటిలో దీని ఉపయోగం ఉంటుంది. ఈ లవణం వేడి స్వభావం గలది, అలాగే ఇది తేలికగా ఉండి సులభంగా జీర్ణం అవుతుంది.
రోమక లవణం
ఈ రోమక లవణాన్ని ‘ సాంభార్ సాల్ట్’ అని కూడా అంటారు. అలా అనడానికి కారణం ఈ ఉప్పు రాజస్థాన్ లోని జైపూర్ దగ్గరలో ఉండే సాంబార్ లేక్ ప్రాంతంలో తయారు అవుతుండడం. దీనిని ‘ ఎర్తెన్ సాల్ట్ ’ అని కూడా అంటారు. ఈ రోమక లవణం తయారుచేయడానికి సాంభార్ చెరువు లోని నీటిని కొంత వేరు చేసి సూర్యుని వేడికి ఆవిరి అయ్యేలా చేస్తారు, అలా చేసినప్పుడు మిగిలిన ఉప్పునే రోమక లవణం లేదా సాంభార్ సాల్ట్ అంటాం. ఈ లవణంలో 97 శాతం సోడియం క్లోరైడ్ ఉంటుంది, మిగతా భాగంలో సోడియం బైకార్బోనేట్ మరియు సల్ఫైడ్ ఉంటుంది.
ఈ రోమక లవణం వాత దోషాన్ని సమతుల్యం చేసే గుణంతో ఉంటుంది. ఇది అధిక వేడి స్వభావంతో ఉండి, తిన్నప్పుడు శరీరం అంతటా వేగంగా విస్తరిస్తుంది. అజీర్ణం సమస్యగా ఉన్నప్పుడు ఈ రోమక లవణం సహాయపడుతుంది. డయేరియా, అధిక రక్తపోటు ఉన్న వారు మరియు గర్భిణీ స్త్రీలు దీన్ని తీసుకోకూడదు. ఆయుర్వేదంలో ఔద్భిద లవణం అనే మరో రకమైన ఉప్పు ఉండేది, కానీ ఆ ఉప్పు రోమక లవణానికి సమానంగా ఉండేదట.
సముద్ర లవణం
సముద్ర లవణాన్ని సింపుల్ గా సీ సాల్ట్ అనవచ్చు. ఇది సముద్రపు నీటిని సూర్యుడి వేడికి ఆవిరి చేసి తయారుచేయబడిన ఉప్పు. ఈ ఉప్పులో 91 శాతం సోడియం క్లోరైడ్ ఉంటే, మిగతా భాగం సల్ఫైడ్, ఐరన్, క్యాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, మెగ్నీషియం క్లోరైడ్ ఉంటుంది.
ఈ ఉప్పును మితంగా తీసుకుంటే మనకు నష్టం ఏమీ లేదు. ఈ ఉప్పు రుచి దీనిని తాయారు చేసే ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. ఆహారంలో కాకుండా ఇతర ఉపయోగాలకు కూడా ఉప్పును మనం ఎన్నో ఏళ్ళ నుండి ఉపయోగిస్తూనే ఉన్నాం. మన శరీరంలో ఎలాక్త్రోలైట్ కంటెంట్ బ్యాలెన్స్ అవ్వడానికి మనం ఉప్పు తినడం అవసరం. ఈ సముద్ర లవణం మితంగా తీసుకోవడం వల్ల ఆర్తరైటిస్ వంటి సమస్యలు తగ్గడం, రోగనిరోధకశక్తి పెరగడం, జీర్ణ క్రియ సరిగ్గా అవ్వడం వంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ పంచ లవణాలతో పాటూ ఆయుర్వేదంలో ఉప్పు గురించీ, ఇంకా చాలా వివిధ రకాలైన ఉప్పుల గురించి రాయబడింది. ఆయుర్వేదం ప్రకారం ఈ పంచ లవణాలు మితంగా తీసుకున్నప్పుడు లేదా ఔషధాలలో ఉపయోగించినప్పుడు మన ఆరోగ్యానికి మంచి చేస్తాయి.
ఇప్పుడు మనం తింటున్న టేబుల్ సాల్ట్ సంగతేంటి?
ఇప్పుడు మనం తినే టేబుల్ సాల్ట్ సముద్రం నుండే వస్తుంది కాబట్టి, అది ఆయుర్వేదం చెప్పిన సముద్ర లవణం అనుకుంటున్నారా! అల అనుకుంటే మీరు పొరబడ్డట్లే. ఎందుకంటే ఈ ఉప్పు సముద్రం నుండి బయటకు వచ్చాక చాలా ప్రాసెసింగ్ చేయబడుతుంది. ఆ ప్రాసెసింగ్ తరువాత సోడియం తో పాటు ఎనభై నాలుగు మినరల్స్ ఉండే సముద్ర లవణం, సోడియం క్లోరైడ్ తప్ప ఏమీ లేని ఒక సాధారణ టేబుల్ సాల్ట్ గా మారిపోతుంది.
ఈ టేబుల్ సాల్ట్ ను చాలా స్టెప్స్ గా ప్రాసెసింగ్ చేస్తారు. ఆ ప్రాసెసింగ్ చేసే విధానంలో అందులో యాంటీ కేకింగ్ ఏజెంట్ అనే కెమికల్స్ కలపబడతాయి,అలాగే ఆ సాల్ట్ క్లీన్ గా మరియు వైట్ గా కనిపించడానికి బ్లీచ్ చేయబడుతుంది. ఇలా చేయడం వల్ల ఈ ఉప్పును మన శరీరం సులభంగా అబ్జర్వ్ చేసుకోలేదు, అలాగే ఈ ఉప్పు తినడం వల్ల అధిక బ్లడ్ ప్రెజర్ వంటి సమస్యలు వస్తాయి.
ఉప్పు తెచ్చే ముప్పు
ఉప్పును మితంగా తిన్నంతవరకూ ఏ సమస్యా లేదు, మితి మీరితే మొదలయ్యే సమస్యల గురించి ఇప్పుడు చూద్దాం. ఆయుర్వేదం ప్రకారం ఎప్పుడైతే ఉప్పు బ్యాలెన్స్డ్ గా మనం తింటామో , అప్పుడే మన ప్రేగుల్లో లవణ ఆమ్లాలు కూడా సరిగ్గా విడుదలవుతాయట.
ఉప్పు తినడం పెరిగితే ఊపిరి తిత్తుల్లో నీరు ఎక్కువగా చేరుతుందట, అందువల్ల ఊపిరితిత్తులు ఆ నీటిని బయటకు పంపించడానికి మనకు దగ్గును క్రియేట్ చేస్తాయి, ఈ విధంగా ఉప్పు అధికంగా తింటే దగ్గు కూడా పెరుగుతున్దన్నట్టే. అలాగే సుశ్రుతుడు చెప్పినదాని ప్రకారం, ఉప్పు అతిగా తింటే దురద, దద్దుర్లను కలిగిస్తుంది. అలాగే శరీరం రంగు మరియు కాంతి తగ్గిపోయేలా చేస్తుంది. ఇంకా మన జ్ఞానేంద్రియాలకి కూడా హాని చేస్తుంది. ఇక ఆయుర్వేదంలో చరకుడు కూడా ఉప్పు అధికంగా తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ సమస్య వస్తుందని ఏనాడో తెలిపాడు. ఇవి మాత్రమే కాదు ఉప్పు అధికంగా తింటే వచ్చే సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా అధికంగా తింటే ఉప్పు మనకు చాలా ముప్పు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి.
చివరగా చెప్పేదేమిటంటే,
ఉప్పు మనకు హాని చేయకుండా మేలు చేయాలంటే సరైన సముద్ర లవణాన్ని ఎంచుకోవడం మంచిది, లేదా సైంధవ లవణం ఉపయోగించడం ఇంకా ఉత్తమం. ఈ ఉప్పును రోజుకు ఒక టీ స్పూన్, అంటే 2300 మిల్లీ గ్రాములకు మించి తీసుకోకపోవడం మంచిది. అధిక ఉప్పు ఉన్న ఆహారాలను అవాయిడ్ చేసి, మితంగా ఉప్పును తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. ఎప్పుడూ ఆయుర్వేదం చెప్పిన సరైన ఆహార నియమాలను ఆచరించండి, ఆరోగ్యంగా ఉండండి.
Disclaimer:
This information on this article is not intended to be a substitute for professional medical advice, diagnosis, treatment, or standard medicines. All content on this site contained through this Website is for general information purposes only.