ఆయుర్వేదం, రసాయన ఆయుర్వేదం వేర్వేరు కాదు. అధర్వణ వేదానికి ఉపవేదమైన ఆయుర్వేదంలోని అష్టాంగయోగాల్లో రసాయన ఆయుర్వేదం ఒకటి. రసాయన ఆయుర్వేదం మిగలిన ఎనిమిది శాఖల కంటే కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అష్టాంగయోగాలను ఆధునిక వైద్య విధానంలో అన్వయించడం జరిగింది. ఉదాహరణకు జనరల్ మెడిసిన్‌ను కాయచికిత్స అని, శస్త్రచికిత్సను శల్య చికిత్స అని, చెవి – ముక్కు – గొంతు విభాగాలకు సంబంధించిన చికిత్సలను శాలాక్య చికిత్స అని, కౌమారభ్రుత్యం అంటే పీడియాట్రిక్ అని, వాజీకరణ అంటే సెక్సాలజీ అని, భూత చికిత్సను మైక్రో బయాలజీ అని, అగద అంటే టాక్సిక్ సైన్స్‌గానూ విభజించడం జరిగింది. వీటిలో ఇమ్యునిటీ కోసం మాత్రం రసాయన ఆయుర్వేదం ప్రత్యేకించబడింది.
కేవలం మూలికలతో చేసే వైద్యాన్ని మన ఆయుర్వేదంగా చూస్తుంటాము. కానీ రసాయన ఆయుర్వేదం దైవవైద్యంగా పిలవబడింది. దేవీదేవతలకు వైద్యం చేయడం ద్వారా ధన్వంతరి ఆయుర్వేదానికి ప్రాచుర్యాన్ని తీసుకునిరాగా చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు, మాధవుడు, చక్రపాణిదత్త, బాసవరాజు, ఆచార్య నాగార్జునుడు వారసత్వంగా ఈ విద్యను కొనసాగించి దీనికి కొంతమేర ప్రాచుర్యాన్ని తీసుకునివచ్చారు.
ఆయుర్వేదం లేదా ఆయుష్శాస్త్రం ప్రధానంగా మనసు, శరీరం, ఆత్మల సమన్వయానికి దోహద పడుతూ చక్కటి జీవనశైలిని అలవరుస్తుంది. ఆహార, విహార, వ్యవహారాల విషయంలో ప్రత్యేక దృక్కోణం కలిగి ఉంటుంది. రసాయన ఆయుర్వేదం అయితే మరింత జటిలమైన ఆరోగ్య సమస్యలకు సైతం పరిష్కారాలను చూపుతుంది. సాధారణంగా వ్యాధులు ప్రబలినప్పుడు రోగనిరోధక శక్తి మెల్లిగా తగ్గుతుండటం సహజంగా జరిగే ప్రక్రియ. ఒకపక్క వ్యాధినిరోధక శక్తి తగ్గకుండా దాన్ని పెంపొందింపజేస్తూ మరోపక్క వ్యాధికి తగిన చికిత్స అందించడమే రసాయన ఆయుర్వేదం యొక్క ప్రత్యేకత. సాధారణ వ్యాధుల కంటే కూడా చాలావరకు మొండి వ్యాధులకు ఈ రసాయన చికిత్సను ఆచరించి చరక, సుశ్రుత, వాగ్భటాచార్యులు వారు, ఆచార్య నాగార్జునుడు దీనికి విశిష్టతను తీసుకొనివచ్చారు. అంతేకాదు వారు ఆచరించిన ప్రతి పద్ధతిని గ్రంధస్తం చేసి భావితరాలకు అందించారు.
Also Read: రసాయన ఆయుర్వేదం క్యాన్సర్ కణాలపై ఎలా పోరాడుతుంది?
Disclaimer:
This content is for informational purposes only. Read full disclaimer [here]





















