భారతదేశంలో ఏటా యాభై వేల మందికి చిన్న పిల్లలకు క్యాన్సర్ !

You are currently viewing భారతదేశంలో ఏటా యాభై వేల మందికి చిన్న పిల్లలకు క్యాన్సర్ !

క్యాన్సర్.. 

మనిషి ఆరోగ్యంపై కురిసే విషపు జలపాతం.

మనిషి ఆలోచనల్లో కూడా ప్రాణభయం పుట్టించే రాక్షస సర్పం.

మనిషి జీవితంలో భూమ్మీదే నరకానికి దారి చూపించే యమ పాశం.

వయసు మళ్ళిన మనిషికి క్యాన్సర్ అనే వార్త బాధను ఇస్తుంది..

ఇంట్లో గృహిణి కి క్యాన్సర్ అనే వార్త కుటుంబానికే విషాద ఛాయ అలుముతుంది..

ఉద్యోగం చేసే మనిషికి క్యాన్సర్ అనే వార్త తనకు ఉన్న బాధ్యతల వల్ల రెట్టింపు భయాన్ని ఇస్తుంది..

అదే చిన్న పిల్లాడికి క్యాన్సర్ అంటే?

కలిగే బాధ.. పెరిగే భయం.. ఊహాతీతం!

మన భారత దేశంలో ఏటా అక్షరాలా యాభై వేల మంది చిన్న పిల్లలకు కొత్తగా క్యాన్సర్ వస్తుందట. క్యాన్సర్ వచ్చిన ఎనభై శాతం మంది పిల్లల్లో వచ్చే క్యాన్సర్ గుర్తించే సమయానికే అది వేరే భాగాలకు కూడా వ్యాపించి ఉంటుందట. 

ప్రపంచం మొత్తంలో సంవత్సరానికి మూడు నుండి నాలుగు లక్షల మంది పిల్లలకు క్యాన్సర్ నిర్ధారించబడుతుంది. అమెరికాలో క్యాన్సర్ సోకిన ప్రతీ ఐదు మంది పిల్లల్లో ఒకరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. చిన్నప్పుడే క్యాన్సర్ చికిత్స కోసం ప్రమాదకరమైన చికిత్సా విధానాలు ఉపయోగించడం వల్ల క్యాన్సర్ సోకిన పిల్లలలో తొంభై తొమ్మిది శాతం పిల్లలకు దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయట. తొంభై ఆరు శాతం పిల్లలకు ప్రాణాలకు ప్రమాదమయ్యే ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయట.

ఇవన్నీ నిజాలు. తప్పక నమ్మాల్సిన నమ్మలేని నిజాలు!

పిల్లల్లో వచ్చే క్యాన్సర్ లో ముఖ్యమైనది లుకేమియా, ఇది రక్తం మరియు బోన్ మ్యారో పై ప్రభావం చూపుతుంది. ప్రతీ ముగ్గురు క్యాన్సర్ నిర్ధారణ జరిగిన పిల్లల్లో ఒకరికి ఈ సమస్యనే ఉంటుంది. రెండవది బ్రెయిన్ ట్యూమర్, మెదడులో కణాలు అబ్నార్మల్ గా పెరగడం వల్ల ఈ సమస్య వస్తుంది. మూడవది సార్కోమా, ఈ రకమైన క్యాన్సర్ ఎముక, కండరం, కార్టిలేజ్ లో మొదలవుతుంది. ఇక నాలుగవది లింఫోమా, ఇది శరీరంలోని లిమ్ఫటిక్ సిస్టం లో వస్తుంది. లిమ్ఫటిక్ సిస్టం అనేది రోగనిరోధక వ్యవస్థలో భాగం. ఈ రకమైన క్యాన్సర్ ల తో పాటూ పిల్లల్లో ఇంకా లివర్ సంబంధిత హెప్టిక్ ట్యూమర్, నరాలకు సంబంధించిన న్యూరోబ్లాస్టోమా, కంటికి సంబంధించి రేటినోబ్లాస్టోమా,కిడ్నీలకు సంబంధించి నేఫ్రోబ్లాస్టోమా వంటివి పిల్లల్లో వస్తున్నా క్యాన్సర్లు.

ఇక వీటికి కారణం ఒకటంటూ చెప్పలేం..

పుట్టుకతోనే సమస్య ఉండి ఉండవచ్చు. తల్లి గర్భంలోనే సమస్య మొదలై ఉండవచ్చు. ఎప్స్టిన్ బార్ వైరస్ లాంటి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చి ఉండవచ్చు, సెకండ్ హ్యాండ్ స్మోక్ , కెమికల్స్ ప్రభావం, కాలుష్యం ఇలా మరే ఇతర కారణాల వల్ల అయినా రావచ్చు.

పిల్లల్లో వచ్చే క్యాన్సర్ ను నివారించడానికి ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి.

  • పిల్లల చుట్టూ స్మోక్ చేయకండి. స్కూల్ వయసులోనే ఈ జెనరేషన్ లో స్మోక్ కి అలవాటు అవుతున్న పిల్లలను అటు వైపుకు వెళ్ళనివ్వకుండా చూడండి.
  • పిల్లలను రోజంతా ఎండలో ఉండనివ్వకండి. ఇది చర్మానికి సంబంధించిన క్యాన్సర్ కి కారణం కావచ్చు. ఒకవేళ ఎక్కువగా ఎండలో వెళ్ళాల్సి వస్తే సన్ స్జ్రీన్ ఉపయోగించండి.
  • చిన్నప్పటినుండే సరైన వ్యాయామం నేర్పించండి, సరైన ఆహార నియమాలు అలవాటు చేయండి. 
  • ఇంట్లో ఉండే కెమికల్ ఎక్స్పోజర్ వల్లే పిల్లల్లో లుకేమియా వచ్చే అవకాశం నలభైఎడు శాతం పెరుగుతుందట. అందుకే పిల్లలను కెమికల్స్ ఉన్న వాతావరణానికి దూరంగా ఉంచండి.  సహజమైన పరిస్థితులలో పిల్లలను పెంచండి.
  • ఇంఫేక్షన్స్ నుంచి కాపాడటానికి పిల్లలకు సరైన సమయానికి సరైన వ్యాక్సిన్స్ వేయించండి. పన్నెండేళ్ళ లోపే హెచ్ పీ వీ వ్యాక్సిన్ తప్పనిసరి. 

క్యాన్సర్ అంటే ధూమపానం మద్యపానం వంటి దురలవాట్లు ఉన్న వారికీ, వయసు మళ్ళి రోగనిరోధక శక్తి తగ్గినా వారికీ,  సరైన జీవన విధానం ఆచరించని వారికి మాత్రమె వస్తుంది అనుకోని పిల్లల్లో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. క్యాన్సర్ ఎవరికైనా ఎలా అయినా రావచ్చు.

పిల్లల్లో కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది,

ఆ ప్రమాదాన్ని చాలా వరకూ నివారించే అవకాశం కూడా మనకు ఉంది.  

అందుకని ఈ విషయంలో కాస్త అవగాహనతో ఉండండి! ఆరోగ్యంగా ఉండండి.

Also read: Blood Cancer: బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి?