ఫ్యాట్ తింటే ఫ్యాట్ అవుతామా?

You are currently viewing ఫ్యాట్ తింటే ఫ్యాట్ అవుతామా?

ప్రపంచమంతా ఇప్పుడు వ్యాపించిన ఒక సమస్య ఏంటంటే ఊబకాయం లేదా ఒబీసిటీ.

ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణం ఇదే!

ఇక మార్కెట్లో మనకు ఫ్యాట్ ఫ్రీ ఫుడ్స్ అని, లో ఫ్యాట్ ఫుడ్స్ అని చాలా దొరుకుతున్నాయి, కానీ అసలు ఫ్యాట్ తింటే నిజంగా ఫ్యాట్ అవుతామా?

మన శరీరంలో ఉండే కొవ్వు, బయట మనం తినే ఆహారంలో కొవ్వు వల్లే పెరుగుతుందా?

ఈ సందేహాలకు సమాధానమే ఇది.

మీకు ఫ్యాట్ గురించి సరైన అవగాహన ఇవ్వడానికి మా చిన్న ప్రయత్నమిది.

ఇక మనం ఆరోగ్యంగా ఉండటానికి మనం కచ్చితంగా తినాల్సిన మూడు మ్యాక్రో న్యూట్రియంట్లు ఏంటంటే కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్ మరియు ప్రోటీన్లు. 

ఈ విషయాన్ని మనం ఒప్పుకొని తీరాల్సిందే !

అసలు మనం తినే ఫ్యాట్ మనలో కొవ్వు గా మారడానికి

మనం కారణాలుగా భావిస్తున్న విషయాలు ఇవి : 

  • కారణం 1 : 

ఇక మనం తినే ఫ్యాట్ మన శరీరంలో ఫ్యాట్ గా ఉండేందుకు చాలా వరకూ అవకాశం ఉంది. ఎందుకంటే మన శరీరంలో ఫ్యాట్ అనేది ట్రైగ్లిసరైడ్స్ రూపంలో, అంటే సరిగ్గా మనం తినే ఫ్యాట్ రూపంలోనే ఉంటుంది. ఈ కారణంగా మనం ఈ ఫ్యాట్ తింటే బరువు పెరుగుతామనే అపోహ వచ్చి ఉండవచ్చు.

  • కారణం 2 : 

మన శరీరం చాలా పనులకు కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లనే వినియోగిస్తుంది. మనం వీటిని అవసరమైన దానికంటే ఎక్కువగా తీసుకుంటే ఆ సమస్య మన ఫ్యాట్ మెటబాలిజం పై పడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే మనం  ఎక్కువగా ఈ కార్బ్స్ మరియు ప్రోటీన్ తీసుకుంటే,  మన డయేటరీ ఫ్యాట్ ని మనం ఎనర్జీ కోసం మన శరీరం ఉపయోగించదు, అలాంటప్పుడు ఆ ఫ్యాట్ మన శరీరంలో స్టోర్ అవుతుంది. ఇది కూడా మనం తినే ఫ్యాట్ వల్లే మనం లావు అవుతున్నాం అని చెప్పడానికి ఒక కారణం గా కనిపించవచ్చు.

  • పై రెండు కారణాల పై క్లారిటీ : 

కానీ రీసర్చ్ మాత్రం  లో-ఫ్యాట్ డైట్ అనేది బరువు తగ్గడంలో ఎలాంటి పాత్ర పోషించదు అని చెప్పేసింది. అలాగే తక్కువ ఫ్యాట్ ఉన్న డైట్ తినడం కంటే ఎక్కువ ఫ్యాట్ ఉన్న డైట్ తినడం వల్లే ఆరోగ్యానికి వివిధ సమస్యల నుండి రిస్క్ తగ్గుతుందట. ఎందుకు అనేది ఈ ఉదాహరణ చూస్తే మీకే అర్థమవుతుంది.

  • ఉదాహరణ

ఉదాహరణకు ఒక బ్రెడ్ ముక్క లాంటి సింపుల్ కార్బోహైడ్రేట్లు తిన్నాం అనుకోండి. అప్పుడు మన లాలాజలంలో ఉండే ఎంజైమ్స్ ఆ ఆహారాన్ని వెంటనే గ్లుకోస్ గా బ్రేక్ చేసేస్తాయి, ఆ గ్లుకోస్ మన శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ ని ఆక్టివేట్ చేస్తుంది. అప్పుడు ఆ ఇన్సులిన్,  బ్లడ్ లో ఉన్న ఎక్సెస్ గ్లుకోస్ ని ఫ్యాట్ టిష్యూలో స్టోర్ చేయమని మన బాడీకి చెబుతుంది. అందుకే మనం ఎన్ని షుగర్ అధికంగా ఉన్న కార్బ్ ఫుడ్స్ తిన్నా మళ్ళీ మనకు ఆకలేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మనం కడుపునిండా బిరియానీ తిన్నా కూడా తరువాత ఐస్ క్రీం కనిపిస్తే వెళ్లి తింటాం. ఎందుకంటే ఆ ఆకలిని మనలో అవసరం లేకున్నా షుగర్ తినేలా చేస్తుంది. ఇలా మనకు ఎక్కువ ఫ్యాట్ స్టోర్ అయ్యి ఊబకాయం పెరుగుతుంది.

కానీ అదే మనం ఫ్యాట్ తిన్నాం అనుకోండి. ఆ ఫ్యాట్ ను మన లాలాజలం బ్రేక్ డౌన్ చేయలేదు, అలాగే మన కడుపులో ఉండే యాసిడ్ కూడా పూర్తిగా దాన్ని బ్రేక్ చేయలేదు. అలా ఆ ఫ్యాట్ మన చిన్న ప్రేగులోకి వెళుతుంది. అక్కడికెళ్ళిన తరువాత లివర్ విడుదల చేసే బైల్ ద్వారా అప్పుడు ఆ ఫ్యాట్ బ్రేక్ అవుతుంది. ఇంత నిదానంగా మనకు ఈ ఫ్యాట్ అరుగుదల జరుగుతుంది కాబట్టి మన శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ బ్యాలెన్స్ గానే ఉంటాయి. స్పైక్ అవ్వడం జరగదు. అందుకని ఫ్యాట్ మనలో మరింత కొవ్వు స్టోర్ చేయదు, అలాగే వీటిలో కూడా రకాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

  • ఫ్యాట్స్ లో మంచీ చెడూ..

మనకు ఆలివ్ ఆయిల్ లాంటి వాటిలో లభించే మోనో అన్ స్యాచురేటెడ్ ఫ్యాట్స్  మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. అలాగే మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయం చేస్తాయి. అలాగే ఫిష్ ఆయిల్ లో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , సన్ ఫ్లవర్ విత్తనాలల్లో ఉండే పాలీ అన్ స్యాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా మనకు బ్లడ్ ప్రెజర్ తగ్గించడంలో, గుడ్ కొలెస్ట్రాల్ పెరగడంలో సహాయపడతాయి.  

కానీ ఈ ఫ్యాట్స్ లోనే రెడ్ మీట్ , డైరీ లో దొరికే స్యాచురేటెడ్ ఫ్యాట్ వ్యతిరేకంగా పని చేస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి మంచి కంటే చెడునే ఎక్కువగా చేస్తాయి. వీటిని తగ్గించడం వల్ల చాలా సమస్యల నుండి తప్పించుకోవచ్చు. 

అందుకనే ఈ ఫ్యాట్స్ లో మనం స్యాచురేటెడ్ బదులు అన్ స్యాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవడం మంచిది. ఫ్యాట్స్ సరైనవి, సరైన మోతాదులో తినడం వల్ల మనకు నష్టం కంటే లాభమే ఎక్కువ. కొన్ని సార్లు మన బరువు తగ్గడంలో ఈ ఫ్యాట్స్ మనకు సహాయం కూడా చేస్తాయి.

ఒక్క మాటలో ఫ్యాట్ తింటే ఫాట్ అవుతామా? అనే దానికి సమాధానం చెప్పాలంటే.. 

లేదు. ఫ్యాట్ తిన్నంత మాత్రాన ఫ్యాట్ అవ్వము.

చివరిగా..

ఎందుకంటే మన హెల్త్ అనేది ఎప్పుడూ మనం తినే ఒక విషయం మీదే ఆధారపడదు, ఒక హేల్తీ బ్యాలెన్స్ మనకు అవసరం. ఆలోచనల్లో అయినా, ఆహార విధానాల్లో అయినా !
సింపుల్ గా చెప్పాలంటే మన డైట్ హేల్తీ గా ఉండాలంటే మనం తినే ప్లేట్ లో మంచి ఫ్యాట్స్ ఉండాలి అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా అవసరం, ఇంకా ఫైబర్, ప్రోటీన్ కూడా ఉండాలి. ఇవన్నీ కలిపితేనే అది హేల్తీ డైట్ అవుతుంది.ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి పునర్జన్ ఆయుర్వేద బ్లాగ్ ను ఫాలో అవ్వండి.

Also Read: పాజిటివ్ థింకింగ్ ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుందా?