ఒకవేళ ఒక కుటుంబంలో కొన్ని తరాలుగా ఎవరో ఒకరికి క్యాన్సర్ వస్తుంది అంటే, ఇది యాదృచ్చికమా లేక సైంటిఫిక్ గా దీనికి ఏమైనా కారణం ఉందా అని సందేహం రావటం సహజమే. అలాగే ఒకవేళ సైంటిఫిక్ గా వంశపారంపర్యంగా క్యాన్సర్లు వస్తున్నాయంటే దీనిని నివారించడానికి వీలవుతుందో లేదో అనే భయం కూడా సహజమే. ఆ సందేహాలకు, భయాలకు తెరతీసేది అవగాహన మాత్రమే. వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్లు మరియు వాటిని ఎలా ముందుగానే గుర్తించాలి అనే విషయాలను తెలుసుకోవటానికి ఇది పూర్తిగా చదవండి.
వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్
క్యాన్సర్ అనే వ్యాధికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సరైన సమయంలో గుర్తించి చికిత్స చేయలేకపోతే మనిషి జీవితంలో క్యాన్సర్ పప్రాణానికే ప్రమాదంగా మారుతుంది. చాలా చోట్ల ధూమపానం చేస్తే క్యాన్సర్ వస్తుంది, మద్యపానం చేస్తే క్యాన్సర్ వస్తుంది అనే మాటలు మనం వినే ఉంటాం. మరి ఏమి చేయకుండానే, ఎ దురలవాట్లు లేకుండానే క్యాన్సర్ వస్తుందన్న సంగతి ఎంతమందికి తెలుసు?
అవును. కొంతమందికి క్యాన్సర్ అకారణంగా సోకుతుంది. అకారణంగా అంటే ఇక్కడ కారణాలు లేవని కాదు, కారణాలు తెలియకపోవటం. అందులో ఒకటే ఈ వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్. దీని గురించి పూర్తిగా అర్థం కావాలంటే మనకు జీన్స్ మరియు జీన్ మ్యుటేషన్ గురించి తెలియాలి.
మన కణాలలో ఉండే DNA అనేది జీన్స్ తయారు చేసే బిల్డింగ్ బ్లాక్స్ లాంటిది. జీన్స్ అనేవి శరీరంలోని ప్రతీ కణానికి ఎలా పెరగాలి? ఎలా డెవలప్ అవ్వాలి? ఎలా పని చేయాలి? అలాగే ఎలా డివైడ్ అయ్యి కొత్త కణాలను తయారుచేయాలి? లాంటి సూచనలను ఇస్తాయి. ఈ జీన్స్ అనేవి ప్రతీ కణంలో క్రోమోజోమ్స్ అనే ఒక స్ట్రక్చర్ లో ఉంటాయి.
ఈ క్రోమోజోమ్స్ మనకు తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమిస్తాయి, ఒకవేళ తల్లి తండ్రులలో ఎవరి జీన్స్ లో అయినా క్యాన్సర్ కు సంబంధించిన జెనిటిక్ మ్యుటేశన్స్ జరిగి ఉన్నట్లయితే, ఆ విధంగా వంశపారంపర్యంగా క్యాన్సర్ మరో తరానికి వచ్చే అవకాశం ఉంది. ఇలా జరగటానికి ముఖ్యంగా రెండు రకాల జన్యు మార్పులు కారణం అవుతాయి.
క్యాన్సర్‌కు కారణమయ్యే జన్యు మార్పులు
- ఆటోసోమల్ డోమినెంట్ మార్పులు: ఈ రకమైన మార్పులు వ్యక్తి యొక్క ఒకే ఒక జన్యువులో సంభవిస్తాయి. ఈ మార్పు ఉన్న వ్యక్తులు తమ పిల్లలకు 50% సమస్య సంక్రమించే అవకాశం ఉంది.
- ఆటోసోమల్ రిసెసివ్ మార్పులు: ఈ రకమైన మార్పులు వ్యక్తి యొక్క రెండు జన్యువుల్లోనూ సంభవిస్తాయి. ఈ మార్పు ఉన్న వ్యక్తులు తమ పిల్లలకు 25% సమస్య సంక్రమించే అవకాశం ఉంది.
వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్లకు సంబంధించిన జన్యువులు
ఈ రకంగా వచ్చే క్యాన్సర్లకు కారణం అయ్యే జన్యువులలో ఉదాహరణకు కొన్ని ఇక్కడ చూడవచ్చు.
- BRCA1 మరియు BRCA2 జన్యువులు: ఈ రెండు జన్యువులు సాధారణంగా రొమ్ము క్యాన్సర్ మరియు అండాశయ క్యాన్సర్లకు కారణమవుతాయి.
- APC జన్యువు: ఇది పెద్ద పేగు క్యాన్సర్‌కు కారణమవుతుంది.
- MUTYH జన్యువు: ఇది పెద్ద పేగు క్యాన్సర్, చిన్న పేగు క్యాన్సర్ మరియు మూత్రపిండ క్యాన్సర్‌కు కారణమవుతుంది.
- RET జన్యువు: ఇది థైరాయిడ్ క్యాన్సర్‌కు కారణమవుతుంది.
- NF1 జన్యువు: ఇది న్యూరోఫిబ్రామోటోసిస్ అనే వ్యాధికి కారణమవుతుంది, ఇది చర్మం, నాడీ వ్యవస్థ మరియు కణజాలాలలో క్యాన్సర్‌కు దారితీస్తుంది.
ఈ జన్యువుల గురించి మరింత లోతుగా విశ్లేషిస్తే ముందుగా వీటిలో BRCA1 మరియు BRCA2 జన్యువులు రెండూ DNA రిపేర్‌లో పాల్గొంటాయి. అవి సాధారణంగా కణాలలో DNA లోపాలను సరిదిద్దడంలో సహాయపడతాయి. అలాగే ఈ జన్యువులలో ఒకటి లేదా రెండూ లోపించినప్పుడు, కణాలు DNA లోపాలను సరిదిద్దలేకపోతాయి, ఇది క్యాన్సర్‌కు దారితీస్తుంది. ముఖ్యంగా BRCA1 జన్యువు రొమ్ము క్యాన్సర్ మరియు అండాశయ క్యాన్సర్‌కు కారణమయ్యే జన్యువు. BRCA2 జన్యువు కూడా రొమ్ము క్యాన్సర్ మరియు అండాశయ క్యాన్సర్‌కు కారణమవుతుంది, కానీ BRCA1 అనేది దీనికంటే ఎక్కువశాతం కారణమవుతుంది. ఈ జన్యువుల లోపం ఉన్న మహిళలు 50 ఏళ్ల వయస్సులో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 50% మరియు అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 40% ఉంటుంది.
ఇక RET జన్యువు విషయానికి వస్తే థైరాయిడ్ గ్రంధిలోని కణాల పెరుగుదల మరియు అభివృద్ధిని నియంత్రించడంలో ఇది పాల్గొంటుంది. ఈ జన్యువులో లోపం ఉన్నప్పుడు, థైరాయిడ్ గ్రంధిలోని కణాలు అసాధారణంగా పెరగడం మొదలవుతాయి, ఇది క్యాన్సర్‌కు దారితీస్తుంది. RET జన్యువులో లోపం ఉన్న వ్యక్తులు థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఈ జన్యువులో లోపం ఉన్న వ్యక్తులు 30 ఏళ్ల వయస్సులో థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 50% ఉంటుంది.
ఇక NF1 జన్యువు అనేది ఒక ప్రోటీన్‌ను కోడ్ చేస్తుంది, ఇది నాడీ వ్యవస్థ మరియు కణజాలాలలో కణాల పెరుగుదల నియంత్రించడంలో పాల్గొంటుంది. NF1 జన్యువులో లోపం ఉన్నప్పుడు, ఈ ప్రోటీన్ సరిగ్గా పనిచేయలేకపోతుంది, అలాంటప్పుడు అది క్యాన్సర్‌కు దారితీస్తుంది. ఈ సమస్య వల్ల ముఖ్యంగా వచ్చే క్యాన్సర్లు ఏవి అంటే మెదడు క్యాన్సర్, మెలినోమా, మూత్రపిండ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్hereditary ఎక్కువగా రావచ్చు.
అలాగే APC జన్యువు అనేది మానవ శరీరం యొక్క అన్ని కణజాలాలలో కనిపించే ఒక ప్రోటీన్ కోడ్ చేస్తుంది. ఈ ప్రోటీన్ కణాల పెరుగుదల నియంత్రించడంలో పాల్గొంటుంది, మరియు ఇది కణాల మరణాన్ని కూడా నియంత్రిస్తుంది. APC జన్యువులో లోపం ఉన్నప్పుడు, ఈ ప్రోటీన్ సరిగ్గా పనిచేయలేకపోతుంది, అప్పుడు క్యాన్సర్ రావచ్చు. APC జన్యువులో లోపం ఉన్న వ్యక్తులు పెద్ద పేగు క్యాన్సర్‌కు అధిక ప్రమాదం ఉంది.
వీటితో పాటు ఇంకా చాలా జన్యువులు వంశపారంపర్య క్యాన్సర్ రిస్క్ కు కారణం అవుతాయి. ఈ వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ రిస్క్ ను ముందే తెలుసుకోవటానికి కొన్ని పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. కానీ వాటికంటే ముందు జెనిటిక్ కౌన్సెలింగ్ కు హాజరవ్వాలి.
జెనిటిక్ కౌన్సెలింగ్
వంశపారంపర్యంగా క్యాన్సర్ వచ్చే రిస్క్ తెలుసుకోవటానికి వైద్యుడిని సంప్రదించాక కొన్ని పరీక్షలు సూచిస్తారు. కానీ వాటికి ముందే ఈ పరీక్షల వల్ల జరిగే మంచి మరియు చెడులను వ్యక్తి తో పూర్తిగా మాట్లాడతారు. తరువాత వారు అంగీకరిస్తే పరీక్ష చేసుకోవచ్చు.
ఇక జన్యు పరీక్షలు ఎవరికి ఉపయోగపడతాయో లేదో నిర్ణయించడానికి ముఖ్యంగా పరిగణించాల్సిన అంశం ‘కుటుంబ చరిత్ర’. కుటుంబంలో క్యాన్సర్ ఎవరికైనా వచ్చి ఉన్నట్లయితే ఆ కుటుంబంలో ఉన్న తరువాతి తరాల వ్యక్తులు గానీ, మిగతా ఆ కుటుంబంలోని వ్యక్తులు గానీ ఈ జన్యు పరీక్షలు చేయించుకోవటం మంచిది.
ఈ జన్యు పరీక్షలు క్యాన్సర్ వచ్చే అవకాశాలను గుర్తించడంలో సహాయపడతాయి, కానీ అవి ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది అని కానీ లేదంటే క్యాన్సర్ రాదు అని కానీ చెప్పటానికి కాదు. ఒకవేళ జన్యు పరీక్షలు పాజిటివ్‌గా ఉంటే, అది క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని సూచిస్తుంది. జన్యు పరీక్షలు నెగటివ్‌గా ఉంటే, అది క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉందని సూచిస్తుంది, కానీ అది క్యాన్సర్ ఖచ్చితంగా రాదని అర్థం కాదు. ఇక కొన్ని సార్లు ఈ జన్యు పరీక్షల్లో వచ్చిన రిజల్ట్ అనేది పాజిటివ్ అయితే వ్యక్తికి ఆందోళన, ఒత్తిడి లాంటి మానసిక సమస్యలు కూడా రావచ్చు. జన్యు పరీక్షలు చేయించుకోవాలనుకునే వ్యక్తులు తమ వైద్యుడితో స్పష్టంగా అన్ని విషయాలు మాట్లాడాలి.
వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ రిస్క్ ను తెలుసుకోవటానికి చేయించుకోవాల్సిన జన్యు పరిక్షలు
- బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ కోసం బ్రెస్ట్ క్యాన్సర్ జన్యు పరీక్ష (BRCA పరీక్ష):
ఈ పరీక్ష BRCA1 మరియు BRCA2 జన్యువులలో మార్పులను గుర్తిస్తుంది. BRCA1 మరియు BRCA2 జన్యువులు బ్రెస్ట్ క్యాన్సర్ మరియు ఓవరిన్ క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- కోలోరెక్టల్ క్యాన్సర్ నివారణ కోసం హెరిటేరియన్ కోలోరెక్టల్ క్యాన్సర్ (HNPCC) పరీక్ష:
ఈ పరీక్ష HNPCC జన్యువులలో మార్పులను గుర్తిస్తుంది. HNPCC జన్యువులు కోలోరెక్టల్ క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- మెలనోమా నివారణ కోసం నేచురల్ హిస్టరీ స్కాన్ (NHS): ఈ పరీక్ష చర్మంపై మేలనోమా అవకాశాలను గుర్తించడానికి సహాయపడుతుంది.
ఒకవేళ మీరు క్యాన్సర్ నివారణ కోసం జన్యు పరిక్షలు చేయిన్చుకోవలనుకుంటే వైద్యుడిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. రిపోర్ట్ వచ్చాక అనవసరంగా భయం పెంచుకోకుండా నివారణ మార్గాలను అనుసరించండి. వీటితో పాటే వివిధ రకాల క్యాన్సర్ లకు సమస్యను బట్టి వివిధ పరీక్షలను వైద్యులు సూచిస్తారు.
క్యాన్సర్లలో ఎంత శాతం వారసత్వంగా వస్తాయి?
వంశపారంపర్య లేదా జన్యుపరంగా వచ్చే క్యాన్సర్లు పర్యావరణ లేదా జీవనశైలివల్ల వచ్చే వాటికంటే తక్కువ శాతం ఉంటాయి. ఒక అధ్యయనం ప్రకారం అన్ని క్యాన్సర్లలో 5 శాతం నుండి 10 శాతం వరకు వంశపారంపర్య క్యాన్సర్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉందట. అలా అని ప్రతీ క్యాన్సర్ వంశపారంపర్యంగా రాటు అలా రావటానికి కొన్ని ప్రత్యేకమైన జన్యువులు ఉంటాయి. అవి కూడా కొన్ని రకాల క్యాన్సర్లకు మాత్రమే కారణమవుతాయి.
వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్లను నివారించాగలమా
చివరగా చెప్పేదేమిటంటే:
వంశపారంపర్యంగా క్యాన్సర్ వస్తుంది అనే మాట కొంత వాస్తవమే, కానీ ఈ నిజానికి జన్యుపరంగా వచ్చే సమస్యలో క్యాన్సర్ రిస్క్ మిగతా వారిలో కంటే ఎక్కువగా ఉంటుంది అందువల్ల ముందుగానే అప్రమత్తంగా ఉంది ప్రాథమిక దశల్లోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేసుకోవచ్చు. మీకు కుటుంబ పరంగా క్యాన్సర్ వస్తుందనే అనుమానం ఉన్నట్లయితే వైద్యుడితో మాట్లాడి సలహా తీసుకోండి. తప్పనిసరైతే జన్యు పరీక్షలు చేయించుకొని క్యాన్సర్ రిస్క్ ను తగ్గించుకునేలా జీవన శైలిలో మార్పులు చేసుకోండి. అప్రమత్తంగా ఉండి అనుమానం రాగానే వైద్యులను సంప్రదించండి. సరైన సమయానికి సరైన వైద్యం సమస్యను తగ్గించగలదు.
Also read: జీవితంలో క్యాన్సర్ రిస్క్ ను తగ్గించే ఐదు అలవాట్లు..
Disclaimer:
This information on this article is not intended to be a substitute for professional medical advice, diagnosis, treatment, or standard medicines. All content on this site contained through this Website is for general information purposes only.