మొబైల్ అడిక్షన్ చేసే నష్టమేంటి? దాని పరిష్కారమేంటి?

You are currently viewing మొబైల్ అడిక్షన్ చేసే నష్టమేంటి? దాని పరిష్కారమేంటి?

ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ ఒక అధ్బుతం !

ఆ తరువాత అది కేవలం ఒక పరికరం!

ఆ తరువాత అది మనిషికి అవసరం !

ఆ తరువాత అది మనిషికి అలవాటు !

మరి ఇప్పుడు అదో వ్యసనం!

ఈ శతాబ్దంలో కనిపెట్టిన అతి దరిద్రమైన వస్తువేదైనా ఉంటే..అది ఫోన్! 

అని ఒక తెలుగు సినిమాలో హీరో అంటాడు.

 నిజంగా ఫోన్ అనేది మనుషుల అందరి స్వచ్చమైన ఆలోచనలను కలుషితం చేసేసిందనే చెప్పాలి! మనందరి ఆలోచనా సామర్ధ్యాలను పాతాళానికి తొక్కి పడేసిందనే చెప్పాలి! 

మన మానసిక ఆరోగ్యాలను బలహీనంగా మార్చేసి, శారీరకంగా బద్ధకంగా మారేలా చేసిన ఏకైక అధ్బుత ఆవిష్కరణ ఫోన్! ముఖ్యంగా స్మార్ట్ ఫోన్!

ఫోన్ మనను ఎంతకు  దిగాజర్చిందంటే, ఇరవై మూడుకు నలభై ఆరు కలిపితే ఎంతవుతుంది అని ఎవరైనా అడిగితే, బుర్ర ఆ లెక్క వేయడం మానేసి జేబులో ఉన్న ఫోన్ తీసి క్యాలుక్యులేటర్ లో చూడమని చెబుతుంది. వెంటనే ఫోన్ ఓపెన్ చేసి ఆ లెక్క చేసేస్తాం! ఈ మాట వినేందుకు మన ముందు లెక్కల మాస్టారు ఇప్పుడు లేడు కాబట్టి సరిపోయింది, ఆయనే ఉండుంటే పాపం ఎంత బాధపదేవాడో!

ఈ స్మార్ట్ ఫోన్ అనే  అధ్బుతమైన ఆవిష్కరణ.. మనుషుల మనసులను పొల్యూట్ చేసేలా మారుతుంది అని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ ఇప్పటికే ఈ ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్ ఫోన్ అలా మారిపోయింది.

ఒక స్లో పాయిజన్ లా.. స్మార్ట్ ఫోన్ మన అందరి తలల్లోనూ తాండవమాడుతుంది.. 

మనకు తెలియకుండా మన అందరి సమయాన్ని ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా తినేస్తున్న స్మార్ట్ ఫోన్ అడిక్షన్ గురించి.. అదే స్మార్ట్ ఫోన్ వ్యసనం గురించి మాట్లాడదాం!

మన దేశంలో ఒక సగటు మనిషి తన సార్ట్ ఫోన్ ని రోజుకు  ఏడు గంటల పైగా తన స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నాడట. రోజుకు ఏడు గంటలు ఫోన్ వాడటం అంటే సంవత్సరంలో నూట ఆరు రోజులు ఫోన్ మాత్రమె వాడుతూ బ్రతుకుతున్నట్టు.. ఇది చైనా మరియు అమెరికాలో కంటే మన దగ్గరే  ఎక్కువ!

అంతలా స్మార్ట్ ఫోన్ కి మనం బానిసలమయ్యాం.

అంతెందుకు మీరే టెస్ట్ చేసుకోండి.. 

ఒక్కరోజు మీ మొబైల్ లేకుండా మీరు ప్రశాంతంగా ఉండగలరా?

చెప్పినంత ఈజీ అయితే కాదు, ఉండటం.

ఎందుకంటే మనం నిద్ర లేచిన సమయం నుండి మళ్ళీ నిద్ర పోయే క్షణం దాకా ఫోన్ ఉపయోగిస్తూనే ఉంటున్నాం. మన సమయాన్ని వృథా చేయడానికి.. మన ఫోకస్ ని చెడగొట్టడానికి సోషల్ మీడియా అనే భూతం ఎప్పుడూ కాచుకు కూర్చొని ఉంటుంది.. మనం మన సమయాన్ని రోజూ దానికి బాలి ఇచ్చేస్తున్నాం! ఒక సగటు మనిషి రోజుకు పదిహేను సార్లు నవ్వుతాడట, కానీ నూట యాభై సార్లు ఫోన్ స్క్రీన్ లాక్ తీస్తాడట! అందుకే మనకు ఫోన్ వ్యసనం అని చెప్పేది.

సరే, ఈ ఫోన్ అడిక్షన్ వల్ల మనకు జరిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

 

ఈ ఫోన్ అడిక్షన్ వల్ల జరిగే నష్టాల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది, 

అయినా కేవలం ఒక లిస్టు గా ఏ రకమైన సమస్యలు రావచ్చో చెప్పాలంటే  ముందు నిద్ర సమస్యలు, ఫోన్ అతిగా చూసి చూసి నిద్రలేమి వచ్చేస్తుంది. తరువాత ఆందోళన, ఫోన్ లో ఉండే కంటెంట్ వల్ల అనవసర పోలికలతో తీవ్రంగా మానసికంగా సమస్యలు అనుభవిస్తారు. ఆ తరువాత డిప్రెషన్, ఫోన్ లో కనిపించే ఫేక్ ప్రపంచాన్ని చూసి రియాలిటీ తో పోల్చుకొని బాధపడి డిప్రెషన్ కొని తెచ్చుకుంటారు. ఆ తరువాత వచ్చేది ఒంటరితనం, పక్కన మనుషులతో గడపక ఫోన్ లోనే ఉండిపోతే ఈ సమస్య ఎలాగో తప్పదు! 

ఆ తరువాత వచ్చేది మెడ నొప్పి, కంటి సమస్యలు ఇలాంటి కొన్ని శారీరక సమస్యలు. అలాగే వాడుతూ పొతే ఇంకా ఎన్నో మానసిక రుగ్మతలు రాక మానవు! లోతు గా వెళితే ఈ సమస్యల సంఖ్య డబల్ అవ్వచ్చు, ఇంకా అంతకన్నా ఎక్కువే అవ్వచ్చు.. అంతటి ప్రమాదకరం ఫోన్ అడిక్షన్!

సరే మరి బయటికి ఎలా రావాలి? అనేదే ప్రశ్న అయితే.. సమాధానం చూద్దాం.

సగం మంది ఫోన్ అడిక్షన్ నుండి బయటకు ఎలా రావాలని ఫోన్ లో ఇంటర్నెట్ లోనే వెతికేస్తుంటారు. అక్కడ కుప్పలు కుప్పలు గా వందల టిప్స్ దొరుకుతాయి. కానీ అవేవీ వీళ్ళకు పని చేయవు. ఎందుకంటే ఫోన్ అడిక్షన్ పోవాలంటే ముందు ఆ అడిక్షన్ పోగొట్టుకోవాలి అనే ఆలోచన నుండి మార్పు మొదలవ్వాలి.

అంతే కానీ ఒక రోజు బలవంతంగా దూరం పెడితే అలవాటు దూరం కాదు.

అందుకే ఫోన్ నుండి మిమ్మల్ని మీరు కాస్త డిటాక్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి. 

ఫోన్ తో వేస్ట్ చేసే సమయాన్ని వేరే పనులకు కేటాయించి చూడండి. ఏదైనా నేర్చుకోండి, 

పుస్తకాలు చదవండి, పాటలు పాడండి, వ్యాయామం చేయండి, డ్యాన్స్ చేయండి… ఇలా ఏదైనా సరే! 

మీ మనసును ఉల్లాస పరిచే పనులు చేయండి..ధ్యానం, యోగా ఇలా ఏదైనా!

ఫోన్ కి కాస్త దూరంగా ఉండటం నెమ్మదిగా ప్రాక్టీస్ చేయండి.

చివరగా

 ఆలోచించండి, నిజంగా అవసరమైతేనే ఆ ఫోన్ ఉపయోగించండి. టైం పాస్ కోసం, బోర్ కొట్టిందని వాడకండి. పాటలు వినాలనిపించినా సరే మీకు నచ్చితేనే వినండి, ఎదో బోర్ కొట్టిందని కాదు.. ఇలా కాస్త మీకు మీరు దగ్గరవ్వండి. మిమ్మల్ని ఒంటరి వాణ్ని చేస్తున్న ఆ ఫోన్ దానంతట అదే దూరమవుతుంది!

ఆల్ ది బెస్ట్!

Also Read: తెల్లగలిజేరు / పునర్నవ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

Disclaimer:

This information on this article is not intended to be a substitute for professional medical advice, diagnosis, treatment, or standard medicines. All content on this site contained through this Website is for general information purposes only.