పొగ త్రాగటంలాగే – పెస్టిసైడ్స్ వాడటం ఆరోగ్యానికి హానికరం! క్యాన్సర్ కి కారకమా?

You are currently viewing పొగ త్రాగటంలాగే  – పెస్టిసైడ్స్ వాడటం ఆరోగ్యానికి హానికరం!  క్యాన్సర్ కి కారకమా?

ఈ రోజుల్లో వ్యవసాయాన్నీ పురుగుల మందులను విడదీసి చూడలేం. మనం ఎక్కువ పంటలు పండించాలనే ఆశతో ఎక్కువ పెస్టిసైడ్స్ ను వాడటం అలవాటుగా చేసుకున్నాం.

ఇది మనందరం ఒప్పుకొని తీరాల్సిన నిజం!

ఇక దీని వల్ల కలిగే ప్రమాదాలను కూడా ఎదుర్కోవాల్సింది మనమే. చేసిన పాపానికి అనుభవించక తప్పదన్నట్టు ఈ ఈ పొరపాటు కూడా మన ఆరోగ్యాలపై కాటు వేసే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ అనేది చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారడం, అలాగే ఇది కెమికల్ ఎక్స్పోజర్ వల్ల కూడా రావడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ క్యాన్సర్ రిస్క్ అనేది ఈ రైతులకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళే ఈ రసాయనాలకు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంటారు. అసలు క్యాన్సర్ విషయంలో పొగ త్రాగడం, పెస్టిసైడ్స్ వాడటం ఒకే తరహా ప్రమాదాన్ని తెస్తున్నాయా?

ఈ విషయాన్ని మరింత లోతుగా విశ్లేషిద్దాం.

ఆధునిక వ్యవసాయంలో పెస్టిసైడ్స్ పాత్ర ఏమిటి?

వ్యవసాయంలో పెస్టిసైడ్స్ ను, పంటలను నాశనం చేసే కీటకాలు, కలుపు మొక్కలు, శిలీంధ్రాలు మరియు ఎలుకలను నియంత్రించడానికి ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఉన్న ఆధునిక వ్యవసాయంలో పెస్టిసైడ్స్ వాడకం వలన పంటల దిగుబడి పెరుగుతుంది మరియు రైతులకు నష్టాలు కూడా కొద్దో గొప్పో తగ్గుతూ వస్తున్నాయి. కానీ దీనివల్ల రైతులకు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావడం పెరుగుతూ ఉంది. ఈ పెస్టిసైడ్స్ వల్ల ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నట్టు మనందరికీ స్పష్టంగా అందరికీ తెలిసిన విషయమే. కీటకాలను చంపగల పెస్టిసైడ్స్ , మనుషుల ఆరోగ్యానికి కూడా ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలం వీటికి ఎక్స్పోజ్ అయిన వారికి ఇవి మరింత ప్రమాదకరం.

ఇక వీటిలో చాలా రకాలు ఉన్నాయి. ఉదాహరణకు కీటక నాశినులు, కలుపు నాశినులు, శిలీంధ్ర నాశినులు అలాగే ఎలుక నాశినులు. ప్రతి రకం ఒక ప్రత్యేక టార్గెట్ పై పనిచేసే విధంగా ఉంటుంది. అలాగే వీటిని పిచికారీ చేసేటప్పుడు, పెస్టిసైడ్స్ లోని రసాయనాలు చర్మం ద్వారా, శ్వాస ద్వారా లేదా మింగడం ద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశించవచ్చు. ఇదే ఎక్కువ కాలం కొనసాగితే, వీటి వల్ల క్యాన్సర్ లాంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

పెస్టిసైడ్స్తో కాన్సర్!

మనకు తెలిసినట్లుగానే , కాన్సర్ అనేది అసాధారణ కణాల అదుపు లేని పెరుగుదల ఫలితం. ఈ కణాలన్నీ కలిసి కణితులుగా మారి, శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించగలవు. ఇది జన్యుపరమైన మార్పుల వలన కలగవచ్చు, లేదా పర్యావరణ కారకాల వలన కూడా సంభవించవచ్చు. ఉదాహరణకు ఈ కార్సినోజెన్లకు గురి కావడం వలన. కార్సినోజెన్లు అంటే కాన్సర్ కలిగించే పదార్థాలు. పెస్టిసైడ్స్ కూడా ఇలాంటి కార్సినోజెన్లే. అవి అనేక రకాల కాన్సర్లకు కారణమవుతాయి.

ఇక వీటి ప్రభావం వలన కలిగే అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ఇవి DNA ను నాశనం చేసే అవకాశం కూడా ఉంటుంది. దీనివలన క్యాన్సర్ ప్రమాదం పెరిగే అవకాశం లేకపోలేదు. కొన్ని పెస్టిసైడ్స్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లో ఒక విభాగమైన అంతర్జాతీయ కాన్సర్ పరిశోధన సంస్థ (IARC) వర్గీకరించడం జరిగింది. ఉదాహరణకు, గ్లైఫోసేట్ అనే ఒక సాధారణంగా వాడే కలుపు నాశినిని “కార్సినోజెనిక్” అని నిర్ధారించారు. అంటే క్యాన్సర్ కారకం అని అర్థం. దీనిని కొన్ని దేశాలలో నిషేధించడం కూడా జరిగింది.

అలాగే అనేక అధ్యయనాలు పెస్టిసైడ్స్ , కాన్సర్ మధ్య సంబంధాన్ని చూపిస్తున్నాయి. కొన్ని పరిశోధనల ప్రకారం రైతులు కొన్ని రకాల కాన్సర్లకు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారని తెలుస్తుంది. ఉదాహరణకు నాన్-హాడ్జ్కిన్ ల లింఫోమా, ల్యూకేమియా, ప్రోస్టేట్ కాన్సర్ మరియు ఊపిరితిత్తుల కాన్సర్ వంటి క్యాన్సర్ల రిస్క్ రైతుల్లో ఎక్కువవుతూ వస్తుంది.

పెస్టిసైడ్స్ ప్రభావాన్ని పొగతాగడంతో పోల్చడం సమంజసమేనా?

పొగతాగడం కాన్సర్ కి ప్రధాన కారణాలలో ఒకటి అని మనందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులలో 85% పొగతాగడం వలనే జరుగుతున్నాయి. ఇది నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఆహారనాళం కాన్సర్, మూత్రాశయ క్యాన్సర్ వంటి చాలా రకాల క్యాన్సర్లకు కూడా కారణమవుతుంది. పొగలో ఉండే అనేక కార్సినోజెన్లు DNA ను నాశనం చేయగలవని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదాహరణకు బెంజీన్, ఫార్మాల్ డీహైడ్ మరియు టార్. ఇవి అనేక మార్పులను కలిగించి కాన్సర్ కు దారి తీసే అవకాశం ఉంటుంది.

ఇక పెస్టిసైడ్స్ ప్రభావం, పొగతాగడం వల్ల కలిగే ప్రభావం దాదాపు ఒకే విధంగా ఉంటాయి. రెండింటిలోనూ కార్సినోజెన్లు, పదేపదే శ్వాస ద్వారా లోపలికి వెళతాయి లేదా చర్మం ద్వారా ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తాయి. రెండూ కూడా దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను, ముఖ్యంగా క్యాన్సర్ విషయంలో ముఖ్య కారణంగా మారే అవకాశం ఉంటుంది.

అయితే, రెండింటి మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉంది. పొగతాగడం ఒక దురలవాటు, దీనిని స్వయంగా నియంత్రించడం తప్ప ఏమీ చేయలేం, కానీ ఈ పెస్టిసైడ్స్ ఉపయోగించడం రైతులకు ఒక వృత్తిపరమైన ప్రమాదం. అందుకే, రైతుల ఆరోగ్యాన్ని కాపాడటానికి మరింత అవగాహన మరియు రక్షణ చర్యలు అవసరం.

పెస్టిసైడ్స్ ప్రభావం వలన వచ్చే క్యాన్సర్ రకాలు

    • నాన్-హాడ్జ్కిన్ లింఫోమా (NHL)

      ఇది రోగనిరోధక వ్యవస్థలో ప్రారంభమవుతుంది. రైతులలో ఇది, పెస్టిసైడ్స్ వల్ల కలిగే, రిస్క్ కలిగి ఉంది. ఫినాక్సీ మరియు ఆర్గానోఫాస్ఫేట్ వర్గాల పెస్టిసైడ్స్ NHL కి కారణంగా మారే అవకాశం ఉంది.

    • ల్యూకేమియా

      ఇది ఎముక మజ్జ మరియు లింఫ్ వ్యవస్థలో మొదలవుతుంది. రైతులలో పెస్టిసైడ్స్ ప్రభావం, ముఖ్యంగా ఆర్గానోఫాస్ఫేట్లు ల్యూకేమియా ప్రమాదాన్ని పెంచుతాయి. ముఖ్యంగా అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా(AML) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పెస్టిసైడ్స్ ఎలా ల్యూకేమియాను కలిగిస్తాయో ఖచ్చితంగా తెలియదు, కానీ అవి రక్త కణాలలో DNA మార్పులను కలిగిస్తాయని పరిశోధకుల భావన.

    • ప్రోస్టేట్ క్యాన్సర్

      పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా సాధారణంగా వచ్చే క్యాన్సర్ రకం. కొన్ని అధ్యయనాలు పెస్టిసైడ్స్ ప్రభావం మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ మధ్య సంబంధాన్ని చూపించాయి. ముఖ్యంగా కీటకనాశినులు వాడే రైతులలో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉందని నివేదికలు చెప్తున్నాయి. ఈ రసాయనాలు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి, దీని వలన ప్రోస్టేట్ కణాలు పెరిగే ప్రమాదం ఉంటుంది.

    • ఊపిరితిత్తుల కాన్సర్

      పొగతాగడం ఊపిరితిత్తుల కాన్సర్‌కు ప్రధాన కారణమైనప్పటికీ, పెస్టిసైడ్స్ ప్రభావం కూడా ఒక ప్రమాద కారకంగా గుర్తించబడింది. పెస్టిసైడ్స్ సమస్యకు గురైన రైతులు, ముఖ్యంగా శ్వాస ద్వారా లోపలికి వెళ్లే పెస్టిసైడ్స్ వల్ల ఊపిరితిత్తుల కాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. పొగతాగే వారికి ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పెస్టిసైడ్స్ ప్రభావం మరియు పొగతాగడం కలిసి ఊపిరితిత్తుల కాన్సర్ వచ్చే అవకాశాన్ని చాలా ఎక్కువగా పెంచుతాయి.

    • చర్మ కాన్సర్

      చర్మ కాన్సర్లు కూడా పెస్టిసైడ్స్ ప్రభావంతో సంబంధం కలిగి ఉన్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం పనిచేసే రైతులకు ఈ ప్రమాదం ఎక్కువ. కొన్ని పెస్టిసైడ్స్ సూర్యరశ్మి (UV కిరణాలు)తో ప్రతిచర్య చెంది, చర్మాన్ని మరింత హానికి గురి చేస్తాయి. దీని వలన చర్మ కణాలు అసాధారణంగా పెరిగే ప్రమాదం ఉంది.

దీని నుండి బయటపడటం ఎలా?

రైతులలో కాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ముఖ్యమైన కొన్ని రక్షణ చర్యలు చేపట్టడం చాలా ముఖ్యం.

  • రక్షణ దుస్తులు తప్పనిసరి:

    పెస్టిసైడ్స్ ప్రభావాన్ని తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో వ్యక్తిగత రక్షణ పరికరాలు (PPE) ధరించడం ముఖ్యమైనది. ఉదాహరణకు చేతి తొడుగులు, ముసుగులు, కళ్లద్దాలు మరియు రక్షణ దుస్తులు. ఈ PPE పెస్టిసైడ్స్ నేరుగా చర్మం మరియు ఊపిరితిత్తులతోకి రాకుండా నివారిస్తుంది, దీని వలన మింగడం మరియు శ్వాస ద్వారా లోపలికి వెళ్లే ప్రమాదం తగ్గుతుంది.

  • సరైన శిక్షణ మరియు విద్య:

    రైతులు పెస్టిసైడ్స్ ను సురక్షితంగా ఎలా వాడాలో, ఎలా నిర్వహించాలో సరైన శిక్షణ పొంది ఉండాల్సిన అవసరం ఉంది. ఇందులో జరిగే అవకాశం ఉన్న ప్రమాదాలను అర్థం చేసుకోవడం, సూచనలను పాటించడం అలాగే సరైన PPE(Personal protective equipment) ఉపయోగించడం ఉంటుంది. పెస్టిసైడ్స్ వాడిన తర్వాత చేతులు కడగడం, బట్టలు మార్చుకోవడం వంటి పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకోవాలి.

  • పెస్టిసైడ్స్ వాడకాన్ని తగ్గించడం:

    ఇక సాధ్యమైనంత వరకు పెస్టిసైడ్స్ వాడకాన్ని తగ్గించడం వలన వాటి ప్రభావం గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. దీనిని సమగ్ర పురుగు నిర్వహణ (IPM) పద్ధతుల ద్వారా సాధించవచ్చు. ఇందులో పంట మార్పిడి, సహజ ఉత్పత్తులను ఉపయోగించడం అలాగే తట్టుకునే పంట రకాలను ఉపయోగించడం వంటి ప్రత్యామ్నాయ పద్ధతులు ఉంటాయి.

  • క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు:

    అవసరమైన మేరకు ఆరోగ్య పర్యవేక్షణ మరియు వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల, పెస్టిసైడ్స్ ప్రభావంతో సంబంధం ఉన్న ఆరోగ్య సమస్యల ప్రాధమిక సంకేతాలను గుర్తించడానికి సహాయపడుతుంది. ఇందులో కాన్సర్ కూడా ఉంటుంది. త్వరగా గుర్తించడం వలన క్యాన్సర్ విషయంలో కూడా ప్రభావవంతమైన చికిత్స చేయవచ్చు.

పెస్టిసైడ్స్ వాడకం తగ్గించడానికి ప్రత్యామ్నాయ పద్ధతులు ఏమిటి?

  • జైవిక పురుగు నియంత్రణ ఇందులో పంటలను నాశనం చేసే కీటకాలను తినే సహజ శత్రువులను ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు, సాలీళ్లు, లేడీబర్డ్ పురుగులు అలాగే పక్షులను కూడా ఉపయోగిస్తారు.
  • పంట మార్పిడి ఒకే పంటను వరుసగా సాగు చేయకుండా, వివిధ పంటలను మార్చి మార్చి వేయడం వలన పురుగుల ఉధృతి తగ్గుతుంది.
  • సహ పంటలు రెండు లేదా అంతకంటే ఎక్కువ పంటలను ఒకే చోట సాగు చేయడం వలన కీటకాలను నియంత్రించవచ్చు.
  • మట్టి ఆరోగ్యం ఆరోగ్యకరమైన మట్టి పంటలను బలంగా చేస్తుంది, తద్వారా అవి కీటకాలు మరియు వ్యాధులను తట్టుకోగలుగుతాయి.
  • సహజ పెస్టిసైడ్స్వే ప నూనె, వెల్లుల్లి ద్రావణం వంటి సహజ పదార్థాలతో తయారు చేసిన పురుగు మందులు రసాయనిక పెస్టిసైడ్స్ కు మంచి ప్రత్యామ్నాయాలుగా చెప్పవచ్చు.
  • యాంత్రిక నియంత్రణ చేతితో ఏరివేయడం, ట్రాప్స్ ఉపయోగించడం వంటి పద్ధతులు చిన్న తోటలకు సహాయపడతాయి.
  • తట్టుకునే పంట రకాలు కీటకాలు మరియు వ్యాధులను తట్టుకునే శక్తి ఉన్న పంట రకాలను ఎంచుకోవడం చేయాలి.
  • సమగ్ర పురుగు నియంత్రణ (IPM)
    ఇది పైన పేర్కొన్న అనేక పద్ధతులను ఒకే వ్యవస్థలో ఉపయోగించే సమగ్ర విధానం.

చివరిగా చెప్పేదేమిటంటే..

పెస్టిసైడ్స్ ప్రభావం, కాన్సర్ మధ్య సంబంధాన్ని చూపే సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. ఇది వ్యవసాయ రంగంలో మరింత అవగాహన మరియు రక్షణ చర్యల అవసరాన్ని నొక్కి చెబుతోంది. రైతులకు వీటి ప్రభావం వలన వచ్చే కాన్సర్ ప్రమాదం, పొగతాగడం వలన వచ్చే ప్రమాదం ఒకేలా ఉన్నాయన్న విషయం అర్థం చేసుకోవాలి. రక్షణ చర్యలను అమలు చేయడం, వీటి వాడకాన్ని తగ్గించడం ద్వారా, ప్రపంచానికి ఆహారాన్ని అందించే వారిని ఈ రసాయనాల వలన వచ్చే తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాల నుండి రక్షించవచ్చు.

అలాగే ఈ సమస్య గురించి ప్రజలలో అవగాహన పెంచడం చాలా ముఖ్యం. పెస్టిసైడ్స్ ప్రమాదాల గురించి మరియు వాటిని సురక్షితంగా ఎలా ఉపయోగించాలో రైతులకు శిక్షణ ఇవ్వాలి. పాఠశాలలు మరియు కళాశాలలలో వ్యవసాయంలో రసాయనాల వాడకం గురించి విద్యార్థులకు బోధించాలి. మీడియా కూడా ఈ అంశంపై మరింత దృష్టి పెట్టాలి, తద్వారా సమాజంలో అవగాహన పెరుగుతుంది. ఈ మార్పు ఒక్కరోజులో రాదు, కానీ ప్రతి చిన్న చర్య ఒక పెద్ద మార్పుకు దారి తీస్తుంది. మనం ప్రతి ఒక్కరం మన వంతు పాత్ర పోషించాలి – అది సేంద్రీయ ఉత్పత్తులను కొనడం, పె స్టిసైడ్స్ సురక్షిత వాడకం గురించి అవగాహన కల్పించడం, లేదా ప్రత్యామ్నాయ పద్ధతులపై పరిశోధన చేయడం ఏదైనా కావచ్చు. ఇలా చేయడం ద్వారా, మనం రాబోయే తరాల కోసం ఒక ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించగలం.

 ఇటువంటి మరిన్ని ముఖ్యమైన సమాచారాలు తెలుసుకోవటానికి పునర్జన్ ఆయుర్వేద బ్లాగ్స్ ను ఫాలో అవ్వండి.