మనందరికీ ఆరోగ్యంగా మరియు ప్రశాంతంగా ఉండటం ఇష్టం. కానీ మనలో ఎంతమంది అలా ఉండగాలుగుతున్నాం. అసలు అలా ఉండటానికి ఎంత వరకూ ప్రయత్నిస్తున్నాం. ఎప్పుడైనా ఆలోచించారా !
ఒకవేళ చాలా సార్లు ప్రయత్నించి కూడా అలా ఉండలేకపోతుంటే దానికి కారణం మీ E-time కావచ్చు.. అదేనండీ మీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జేట్స్ తో మీరు గడిపే టైం. ఈ సమయం మీకు పనిని తగ్గిస్తుంది అనుకుంటున్నారు కానీ మీ ఆరోగ్యం యొక్క క్వాలిటీని కూడా తగ్గిస్తుందని గుర్తించలేకపోతున్నారు. ఈ విషయం గురించి క్లియర్ గా తెలియడానికి ఇది పూర్తిగా చదవండి.
ఇటీవల జరిగిన స్టడీ ప్రకారం మన భారతదేశంలో సగటు మనిషి ఒక రోజు స్క్రీన్ టైం ఏంటంటే ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలు. వయసుతో సంబంధం లేకుండా ఏడాది గడవని పిల్లాడి నుండి ఎనభై ఏళ్ళ వృద్ధుల దాకా అందరూ రోజులో చాలా సమయం సెల్ ఫోన్. ల్యాప్ టాప్ లేదా టీవీ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. ఇది మన శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి మళ్ళీ తిరిగి పొందలేనంత నష్టాన్ని కలిగిస్తుంది. రెండు గంటలకు మించి స్క్రీన్ టైం అనేది మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు, అది తీవ్రమైన నష్టాన్ని కలిగించవచ్చు అనేది పరిశోధకులు చెప్పిన మాట.
ఇక సింపుల్ గా చెప్పాలంటే మనం ఇన్ని ఎక్కువ గంటలు ఒక స్క్రీన్ కి అతుక్కుపోవడం వల్ల మన శారీరక శ్రమ చాలా తగ్గిపోతుంది. కదలడం తగ్గి ఒకే దగ్గర ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. మనకు తెలియకుండానే మనం శారీరకంగా బద్ధకంగా మరిపోతాం. దీని వల్ల బరువు పెరిగిపోవడం, చురుకుదనం తగ్గడం ఇలా చాలానే సమస్యలు వస్తాయి.
ఇంతేనా అంటారేమో..
కానీ కాదు.
ఇంకా ఇది ముఖ్యంగా మీ నిద్రను డిస్టర్బ్ చేస్తుంది. స్లీప్ సైకిల్ అనేది సరిగ్గా లేక ఆ ప్రభావం మీ ఆరోగ్యం పై పడుతుంది. అలాగే వెన్నునొప్పి, మెడనొప్పి వంటి సమస్యలు పెరుగుతాయి. వీటితో పాటూ ముఖ్యంగా కంటి చూపు బలహీనం అవుతుంది. ఇలా శారీరకంగానే చాలా నష్టం జరుగుతుంది.
ఇక దీనితో పోలిస్తే మానసికంగా జరిగే నష్టం ఇంకా ఎక్కువ. ఇక్కడ ముఖ్యంగా తలెత్తే సమస్యలు డిప్రెషన్ మరియు ఆందోళన. ఈ రెండూ ప్రశాంతమైన జీవితాన్ని తలకిందులు చేయగలవు.
ఈ మొబైల్ అడిక్షన్ అనేది మానసికంగా మనిషిని మరింత బలహీనంగా మార్చగలదు. మెంటల్ హెల్త్ మరియు ఎమోషనల్ హెల్త్ పై ఈ స్క్రీన్స్ చెడు ప్రభావం చూపిస్తాయి. కేవలం స్క్రీన్ టైం మాత్రమే కాదు ఆ స్క్రీన్స్ పై చూసే కంటెంట్ మానసికంగా మరింత సమస్యాత్మకంగా మారవచ్చు. కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం, దేనిపైనా ఆసక్తి లేకపోవడం ఇలా ఎన్నో సమస్యలు కేవలం ఈ అధిక స్క్రీన్ టైం వల్లనే వచ్చే అవకాశం ఉంది.
ఇక చిన్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. చిన్న పిల్లలో అధిక స్క్రీన్ టైం వల్ల అది వారి ప్రవర్తన పై, వారు నేర్చుకునే స్కిల్స్ పై ప్రభావం చూపవచ్చు. వారిలో సరైన నిద్ర లేకపోవడం వంటి సమస్య వారిని చిన్నప్పుడే మానసికంగా బలహీనంగా మార్చగలదు. పిల్లల స్క్రీన్ టైం విషయంలో తల్లిగండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఇన్ని సమస్యలకు కారణం అయ్యే ఆ E-time ని ఈ టెక్నాలజీ మీద నడిచే ప్రపంచంలో మానేయడం సాధ్యం కాకపోయినా, తగ్గించే అవకాశం అయితే మనకు ఉంది.
తప్పనిసరి అనే విషయాలను మనం ఏమీ చేయలేకపోయినా, మన నియంత్రణలో ఉన్న విషయాల్లో అయినా మనం ఈ స్క్రీన్ టైం పై దృష్టి పెట్టె అవకాశం మనకు ఉంటుంది. ఎప్పుడూ సరైన నిద్ర, సరైన శారీరక శ్రమ అనేది మీ స్క్రీన్ టైం వల్ల డిస్టర్బ్ అవ్వకుండా ఉండేలా చూసుకోండి. రోజూ ఒక నిరిష్ట స్క్రీన్ టైం గోల్ ని పెట్టుకోవడం వల్ల స్క్రీన్ టైం తగ్గించవచ్చు. అలాగే రెగ్యులర్ గా విరామాలు తీసుకోవడం, ఇంట్లో పనుల్లో పాలుపంచుకోవడం వల్ల కూడా ఈ స్క్రీన్ టైం తగ్గుతుంది.
ఒకవేళ మీరు అధిక స్క్రీన్ టైం అడిక్షన్ నుండి బయటకు రాలేకపోతే ఇవి ప్రయత్నించి చూడండి. ఇలాంటి చిన్న చిన్న మార్పులే మన మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేయగలవు మరి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి పునర్జన్ ఆయుర్వేద బ్లాగ్ ను ఫాలో అవ్వండి.
Disclaimer:
This information on this article is not intended to be a substitute for professional medical advice, diagnosis, treatment, or standard medicines. All content on this site contained through this Website is for general information purposes only.