ట్రేండింగ్ లో ఉన్న కార్నివోర్ డైట్ వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ !

You are currently viewing ట్రేండింగ్ లో ఉన్న కార్నివోర్ డైట్ వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ !

కార్నివోర్ డైట్..

 ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బిలియన్ వ్యూస్ దాటి వివిధ సామాజిక మాధ్యమాల్లో ఇంటర్నెట్ ద్వారా ఇది  ట్రెండ్ అవుతుంది. దీనికంటే ముందు మనకు పేలియో డైట్, ఆ తరువాత కీటో డైట్ ఇప్పుడు దీని వంతు. కానీ ఈ డైట్ కి ఎంత సపోర్ట్ వస్తుందో అంత వ్యతిరేకత కూడా వస్తుంది. 

కానీ అసలు కార్నివోర్ డైట్ అంటే ఏంటి ?

ఈ డైట్ ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుంది?

అసలు ఈ కొత్త ట్రెండ్ ని ట్రై చేయడం మన ఆరోగ్యానికి నిజంగా మంచిదా ? 

అసలు ఈ డైట్ ఫాలో అయితే జరిగే నష్టాలేంటి ?

అసలు సరైన హేల్తీ డైట్ ఏది?

అనే సందేహాలన్నిటికీ  సమాధానంఇది పూర్తిగా చదివి తెలుసుకోండి.

సింపుల్ గా, అసలు డైట్ అనే దానికి అర్థమేంటి అని అడిగితే ఒక పద్దతి ప్రకారం ఒక రోజులో మనం ఎం తినాలో, ఎంత తినాలో ప్లాన్ చేసుకొని మరీ తినడమే ఈ  డైట్ అని అందరూ చెప్పేమాట.

బరువు తగ్గడానికి ఒక డైట్, బరువు పెరగడానికి ఒక డైట్, బాడీ బిల్డింగ్ కి ఒక డైట్ ఇలా ఒక్కొక్కరూ వాళ్ళ అవసరాన్ని బట్టి డైట్ ని ప్లాన్ చేసుకుంటున్న సమయంలో ఇంటర్నెట్ పుణ్యమా అని ప్రపంచమంతా స్పెషల్ డైట్స్ బయటపడ్డాయి. కీటో డైట్, ఫ్రూట్ డైట్, పేలియో డైట్, ఇప్పుడీ కార్నివోర్ డైట్, ఇలా ఇవన్నీ ఒక కోవకు చెందినవే.

ముందు మనం ఈ కార్నివోర్ డైట్ అంటే ఏంటో చూద్దాం.

ఈ డైట్ అర్థం మనం మన ఆహారంలో కేవలం జంతువులనూ, జంతువుల ద్వారా వచ్చిన ఉత్పత్తులను మాత్రమే తినడం, అంటే మాంసం, గుడ్లు, పాలు వంటివి మాత్రమే మన ఆహారంలో ఉండాలి. మొక్కల ఆధారిత ఆహరం అస్సలు ఉండకూడదు.  అదే కార్నివోర్ డైట్. ఈ డైట్ 2019లో షాన్ బెకర్ అనే ఒక డాక్టర్ రాసిన ది కార్నివోర్ డైట్ అనే పుస్తకం ద్వారా ఎక్కువ మందికి పరిచయం అయింది, ఇన్ఫ్లుయన్సర్ల ద్వారా ప్రపంచమంతా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు దీని గురించి మాట్లాడే వారు, పాటించే వారు కూడా పెరిగిపోతున్నారు.

ప్రతీ డైట్ వెనకా ఒక కథ ఉంటుంది. అసలు దీని వెనక కథ ఏంటంటే మన పూర్వికులు, అంటే మనిషి జాతి పూర్వికులు మంచు యుగంలో కేవలం జంతువులనే తిని ఆరోగ్యంగా బలంగా బతికారు కదా ! మన శరీరం అలాంటిది తినడానికే తయారుచేయబడింది అని కొందరి వాదన. 

సరే ! ఈ కథ గురించి పక్కన పెడితే మన దేశం లో ఈ డైట్ ఫాలో అయ్యి ఆరోగ్యంగా ఉండవచ్చని మీరు అనుకుంటున్నారా?

మన దేశంలో డయాబెటిస్, ఒబీసిటీ తాండవిస్తున్నాయి, ఇక క్యాన్సర్ కూడా ఏం తక్కువ కాదు. ఇలాంటి సమస్యలున్న మనకు ఫైబర్ అందని, చెడు కొలెస్ట్రాల్ పెంచే ఒక డైట్ అలవాటు చేస్తే ఎంత ప్రమాదం! 

రెడ్ మీట్ పై జరిగిన పరిశోధనలు అన్నీ, ఆ మాంసం ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు, ఒబీసిటీ. డయాబెటిస్  వచ్చే రిస్క్ పెరుగుతుందనే చెప్పాయి.

 ఇక మరీ ముఖ్యంగా రెడ్ మీట్ అనేది కోలన్ క్యాన్సర్ రిస్క్ ను పెంచుతుంది. 

ఇక ఈ డైట్ మనం బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది అని కొందరి మాట, ఎందుకంటే ఇందులో అసలు కార్బోహైడ్రేట్స్ అనేవే ఉండవు. కానీ అసలు ఫైబర్ అనేది కూడా లేదు, అందుకే ఇది మన గట్ కి అస్సలు మంచిది కాదు. ఎక్కువ కాలం ఇది అనుసరించే కొద్దీ సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉండవచ్చని పరిశోధకులు కూడా చెబుతున్నారు. ఈ డైట్ వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గాయి అని కొందరు చెబుతున్నా కూడా, ఇప్పటి వరకూ అది నిరూపించడానికి సరైన ఆధారాలేమీ లేవు.

ఇన్నేళ్ళలో సైన్స్ చెప్పింది ఒకటే ! మన ఆహారంలో మనకు కావలసిన ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్ అనేవి అన్నీ ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం అని, కానీ ఈ కార్నివోర్ డైట్ లో అన్నీ ఉండే అవకాశమే లేదు.

ఇక ఈ ట్రెండ్ మీ కంటికి కనిపించి ఉంటే, 

ఒక వేళ మీ తలలో కూడా ఇది ట్రై చేద్దామనే పురుగు పుట్టి ఉంటే మాత్రం జాగ్రత్త !

సరే !

ఈ కార్నివోర్ డైట్ వల్ల ఏ సమస్యలు రావచ్చో తెలుసుకున్న మనకు,

ఆరోగ్యంగా ఉండాలంటే ఏ డైట్ ఫాలో అవ్వాలో కూడా తెలియాలి.  

సింపుల్ గా చెప్పాలంటే మనం మన శరీరానికి ఇచ్చే శ్రమ, మన ఆహారంలో ఉండే క్యాలరీల లెక్క రెండూ బ్యాలెన్స్ గా ఉండేలా చూసుకోవాలి. ఆ క్యాలరీస్ కూడా ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్, విటమిన్స్, మినరల్స్ నుండి మనకు బ్యాలెన్స్డ్ గా అంది ఉండాలి. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది మనం తినే ఆహారం మన శరీర తత్వానికి తగ్గట్టు, ఆయుర్వేదం లో చెప్పిన త్రిదోశాలను మన శరీరంలో సమతుల్యం చేసేలా ఉండాలి. ఈ మూడు విషయాలనూ మన డైట్ లో ప్రతీరోజూ ఆచరించినట్లయితే అదే సరైన డైట్. 

మరో విషయం ! 

ఏం తింటున్నామో  మాత్రమే కాదు, ఎప్పుడు తింటున్నామో  కూడా మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. సరైన సమయానికి మితంగా ఆహారం తీసుకొని, మన పనులు మనం చేసుకొని, ఒత్తిడికీ, చెడు ఆలోచనలకూ తావునివ్వకుండా, వీలైనంత ఇతరులకు మంచి చేసి, ఆ తృప్తి ఇచ్చే ఆనందంతో, ప్రశాంతంగా నిద్ర పోవడమే సరైన దినచర్య.

అయినా మనందరికీ ఆహారాల్లో, అలవాట్లలో  మంచీ చెడూ తెలుసు. తెలియనివి చెప్పడానికి మేమున్నాం. మరి మంచిని పాటించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ?

ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి పునర్జన్ ఆయుర్వేద బ్లాగ్ ను ఫాలో అవ్వండి.

Also Read: టాప్ 8 క్యాన్సర్ ఫైటింగ్ ఫుడ్స్