రుచులతో చికిత్స

You are currently viewing రుచులతో చికిత్స

వాతానికి వగరు.. పిత్తానికి కారం.. కఫానికి తీపి..

ఆయుర్వేదం ప్రకారం మన ఆరోగ్యం విషయంలో మూడు దోషాలకు ప్రాధాన్యత ఉంటుంది.

అవే వాత, పిత్త, కఫ దోషాలు. మనిషి శరీర తత్వాన్ని కూడా ఆ వ్యక్తి లో ఈ దోషాల ఆధిపత్యాన్ని బట్టే నిర్ణయిస్తారు. మన ఆరోగ్య సమస్యలు ఈ దోషాల అసమతుల్యత వల్లనే వస్తాయని చెబుతారు. ఆరోగ్యంగా ఉండటానికి ఈ మూడు దోషాలను సమతుల్యం చేసేలా ఆహారం భుజించాలని, జీవనశైలిని మలచుకోవాలని చెబుతారు. ఈ మూడు దోషాలకు సంబంధించిన ఆహారాలను ఎలా తెలుసుకోవాలి అనే సందేహం గనక మీకు ఉన్నట్లయితే ఇది పూర్తిగా చదివి, సింపుల్ గా రుచులను బట్టి దోషాలను ఎలా సమతుల్యం చేయాలి అనే విషయం గురించి తెలుసుకోండి .

వాతానికి వగరు

వాత దోషం విషయానికి వస్తే,

సాధారణంగా మనకు చలువ చేసే ఆహారాలన్నీ వాత దోషాన్ని పెంచుతాయని అంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ చలవ అనే గుణం వాత దోషానికి ఉందన్నమాట. అలాగే జిడ్డు లేని ఆహారాలు, అంటే నెయ్యి మరియు నూనె తగలకుండా తయారుచేయబడ్డ ఆహారాలు కూడా ఈ వాత దోషాన్ని పెంచుతాయి. అలాగే మనం తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు బలవంతంగా ఆపాలని ప్రయత్నించినా వాత దోషం పెరుగుతుందట. ఇక రుచికీ, దోషానికి ముడి వేసి చూస్తే, రుచులలో వగరు రుచి ఈ వాతదోషానికి సమానంగా ఉంటుంది. ఈ వగరు రుచి అధికంగా తిన్నప్పుడు వాతదోషం పెరుగుతుంది.

మరి తగ్గించుకోవాలంటే ఎలా? అంటే, సింపుల్ గా దీనికి వ్యతిరేకంగా ఉన్నది తినడమే, అంటే వగరు గా ఉండే పదార్ధం, జిడ్డు గుణం కలిగి ఉండదు కాబట్టి వాతాన్ని పంచుతుంది. అదే తీపి ఉండే పదార్ధం, జిడ్డు గుణం కలిగి ఉంటుంది కాబట్టి వాతాన్ని తగ్గిస్తుంది. వగరు వాతానికి అనుకూలంగా పనిచేస్తే, తీపి వాతానికి వ్యతిరేకంగా పనిచేస్తుందన్నమాట.

ఇదే విషయం మన ఆరోగ్యానికి ఎలా పనిచేస్తుందని మీరు అడిగితే గనక,

ఉదాహరణకు మన చర్మం ఆయిలీ గా ఉంది అనుకుంటే, వగరు తినడం వల్ల మన చర్మానికి ఉండే జిడ్డు గుణం పోయి సాధారణ స్థితికి వస్తుంది. అదే తీపి అధికంగా తింటే డ్రై గా ఉండే స్కిన్ కాస్తా మృదువుగా అవుతుంది. ఈ విధంగా మనం రుచులతో చికిత్స కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా శరీర తత్వాలను బట్టి, ఆరోగ్య సమస్యలలో వాత దోషాల ఆధిక్యతను బట్టి ఆయుర్వేద వైద్యులు ఆహార నియమాలు సూచిస్తుంటారు.

ఇక వాత దోషం ఎక్కువగా ఉండే శరీర తత్వం ఉన్న వారికి, ఈ దోషాన్ని పెంచే ఆహార పదార్థాలు తింటే, వాతానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ దోషం ఆధిక్యత ఉన్న వ్యక్తులు వాతాన్ని తగ్గించే తీపి కానీ, పులుపు కానీ మితంగా తీసుకుంటూ వాత దోషాన్ని సమతుల్యంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సింపుల్ గా చెప్పాలంటే వాత దోషం ఆధిక్యత ఉన్న వ్యక్తులు వగరు గా ఉండే ఆహారాలు, జిడ్డు గుణం లేని ఆహారాలు తక్కువగా తినడం మంచిది.

పిత్తానికి కారం

ఇక పిత్త దోషం విషయానికి వద్దాం,

ఇంతక ముందు మనం ఎలా అయితే వాతదోషానికి సమానంగా వగరు రుచి ఉంటుంది అని చెప్పామో, అలాగే పిత్త దోషానికి సమానంగా కారం రుచి ఉంటుంది. పిత్త దోషం విషయానికి వస్తే ఇది మన శరీరానికి వేడి చేసే గుణం ఉన్న దోషం. అందుకనే మనం కారం రుచిని ఎక్కువగా తింటే మన శరీరంలో పిత్త దోషం పెరుగుతుంది. పిత్తదోష లక్షణాల వల్లే మన ప్రేగులలో మరియు నోటిలో అల్సర్లు ఏర్పడతాయి. అందుకే ఆ సమస్యలు, కారం అధికంగా తిన్నప్పుడు గమనిస్తూ ఉంటాం. కారం అధికంగా తినే వారిలో నోటి పూత అనేది చాలా సాధారణం, ఆ కారం, మనలో పిత్త దోషాన్ని పెంచుతుంది కాబట్టి ఆ సమస్య వస్తుంది. మరో విషయం ఏంటంటే కారం, కఫ దోషాన్ని తగ్గిస్తుంది కూడా!

ఒకవేళ మన శరీరంలో కఫం బాగా పెరిగింది అనుకుంటే ఈ కారాన్ని మనం ఆ కఫాన్ని తగ్గించే చికిత్సలా ఉపయోగించవచ్చు. ఇక కారం కఫాన్ని తగ్గిస్తుంది కదా అని కారం ఇష్టం వచ్చినంత తినడం మొదలుపెట్టకండి. ఎందుకంటే కఫం తగ్గిపోయి, అదే పనిలో మీ శరీరంలో ఉష్ణం, పైత్యం బాగా పెరిగిపోయి కొత్త సమస్యలు వస్తాయి. ఇక పిత్త దోషం ఆధిక్యత ఉన్న వారు కారాన్ని కొంచెం లిమిట్ చేయాల్సిన అవసరం ఉంది. మితి మీరితే సమస్యలు తప్పవు మరి.

కఫానికి తీపి

అలాగే కఫ దోషం విషయానికి వచ్చేద్దాం,

ఇందాక మనం అన్నట్టు వగరుకి వాతం,కారానికి పిత్తం అలాగే ఇప్పుడు తీపికి కఫం.

కఫ దోషానికి ఉండే లక్షణాలు, తీపి గుణం యొక్క లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఉదాహరణకు చూస్తె గనక తీపి గుణానికి జిడ్డు గుణం ఎక్కువగా ఉంటుంది, అదే గుణం శరీరంలో కఫ దోషానికి ఉంటుంది. అలాగే బరువుగా ఉండటం అనే గుణం కూడా తీపికి ఉంటుంది. కఫ దోషానికి కూడా ఇలాంటి గుణమే ఉంటుంది, దానిని గురు గుణం అంటుంటారు. ఈ గుణం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వకపోవడం అనే సమస్య వస్తుంది.

ఇక ఇందాక మనం చూసిన దోషాలకు సంబంధించిన కారం, వగరు రుచులు తేలిక గుణాన్ని కలిగి ఉంటాయి. ఇక తీపి విషయానికి వస్తే వాటికి వ్యతిరేకంగా ఉంటుంది. తీపికన్నా అవి తేలికగా జీర్ణం అవుతాయి. ఒక ఉదాహరణగా చెప్పాలంటే తీపి, కారం రెండూ అధికంగా తింటే నష్టమే. తీపి మనకు కారం కంటే ఎక్కువ ప్రమాదం, ఎందుకంటే కారం తేలిక గుణం కలిగి ఉండటం వల్ల త్వరగా జీర్ణం అయిపోతుంది. ఆ గుణం లేకపోవడం వల్ల తీపి మన శరీరంలో ఎక్కువ సమయం ఉండి, ఎక్కువ సమస్యలకు కారణం అవుతుంది.

అలాగే తీపి గుణం కూడా చలువ చేస్తుంది. దీనిని తగ్గించడానికి వేడి గుణం ఉన్న ఆహారం అధికంగా తింటే అదే వేడి మళ్ళీ సమస్య అవుతుంది. అందుకని వాత సంబంధిత సమస్య ఉందన్నప్పుడు, కారానికి, అంటే వేడికి వ్యతిరేకంగా పనిచేసే చలువ ఆహారం అయిన తీపి తీసుకుంటే అప్పుడు వేడి చేయకుండా వాతాన్ని తగ్గించవచ్చు. వేడి శరీరతత్వం వారు ఈ ట్రిక్ పాటించి వేడి పెరగకుండా సమస్యను తగ్గించుకోవచ్చు.

ఇక తీపి రుచిని ఉపయోగించి మనం వాత పిత్త దోషాలను తగ్గించుకోవచ్చు. ఎలా అంటే ఆయుర్వేదం ప్రకారం తీపి అనేది మనకు పోషనను ఇచ్చేది. అందుకని వాత వ్యాధులు, పిత్త సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు తీపి తింటే మంచిదట. అలా అని శనగ పిండి, మైదా పిండి వంటివి కలిపిన తీపి ఆహారాలు తింటే వాటి వేడి గుణం వల్ల ఆ ఆహారం చలవ గుణాన్ని కోల్పోతుంది. సమస్య తగ్గకపోవడం పక్కన పెడితే పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకని బార్లీ జావ, సగ్గుబియ్యం పాయసం, గోధుమ పిండి తో తయారైన తీపి వంటలు వంటివి ఈ వాతపిత్త దోషాలను తగ్గించడంలో సహాయం చేస్తాయి.

ఆరోగ్య సమస్యలపై పులుపు..ఉప్పు..చేదు

పుల్లటి ఆహార పదార్థాలలో ఆకలిని పెంచే శక్తి ఉంటుంది. అలాగే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వడంలో కూడా సహాయం చేయతాయి. మితంగా తీసుకుంటే మనకు పులుపు మేలు చేస్తుందనే చెప్పాలి. సింపుల్ గా చెప్పాలంటే మనం తీపి ఇష్టమని చక్కర కలిపిన నీళ్లు తాగాలి అనుకుంటే అది పైత్యాన్ని కలిగించవచ్చు, అదే అందులో కాస్త నిమ్మరసం వేసి కలిపితే ఆ సమస్య కలగకుండా ఉంటుంది. మజ్జిగలో కూడా కొంచెం నిమ్మరసం, కొంచెం ఉప్పు, కాస్త పంచదార వేసుకొని తాగితే ఇన్స్టంట్ గా ఎనర్జీ వచ్చేస్తుంది.

ఇక ఉప్పు విషయానికి వస్తే ఆయుర్వేదం, ‘భాస్కర లవణం’ అని పిలవబడే ఒక రకమైన ఉప్పును ఔషధంగా వాడితే గనక మన ప్రేగులు బలంగా ఉంటాయి అని చెప్పింది. కాస్త దీన్ని మజ్జిగలో కలిపి తాగితే జీర్ణం సరిగ్గా అవుతుంది. జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఉప్పు అధికంగా తినడం మానేస్తే చాలు, మన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.

ఇక చేదు విషయానికి వస్తే, ముఖ్యంగా ఇది మన శరీరంలో వేడిని తగ్గించడానికి సహాయపడుతుంది. వేడిని తగ్గించడంలో తీపి మరియు చెడు బాగా పనిచేస్తాయి. అలాగే జ్వరాలు వచ్చినప్పుడు కానీ, దీర్ఘకాలిక సమస్యలలో కానీ ఈ చేదు రుచి గల ఆహారం ఔషధంగా పనిచేస్తుంది. ఇక మధుమేహం ఉన్నవారికీ, ఊబకాయులకు ఇది ఇంకా బాగా సహాయపడుతుంది.

ఆరోగ్యం కోసం రుచులను బ్యాలెన్స్ చేయండిలా..

ఈ రుచులు అనేవి ఎదో ఒక దోషాన్ని పెంచేలా ఉన్నపుడు, మరో దోషాన్ని తగ్గించేలా కూడా ఉంటాయి. అందుకని మనం వీటిని బ్యాలెన్స్ చేయడం ముఖ్యం. ఎలా అంటే ఒకవేళ వాతం వల్ల శరీరంలో నొప్పులు వచ్చాయి అనుకుంటే, శొంటి పొడి కారం రుచి తో ఉంది కాబట్టి, ఆ నొప్పిని తగ్గించగలదు. కానీ అది చేస్తే అప్పుడు శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకని అదే శొంటి పొడిని, కొంచెం జీలకర్ర, ధనియాల పొడితో కలిపి తియ్యటి మజ్జిగలో కలుపుకొని తాగితే వేడి చెయ్యకుండానే నొప్పి తగ్గుతుంది. బ్యాలెన్స్ చేయటం అంటే ఇదన్నమాట .

చివరగా చెప్పేదేమిటంటే,

రుచి అనేది కేవలం మన జిహ్వా చాపల్యాన్ని తృప్తి పరచడానికి కాదు, మన ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా సహాయం చేస్తుందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు ఆయుర్వేద వైద్యులు రుచులకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం బ్రతికి ఉండటానికి ఆహారం ఆధారం అయితే, ఆ ఆహారానికి రుచి ప్రధానం అని వారి0 మాట. అందుకని ఈ రుచుల ప్రాముఖ్యతను అర్థం చేసుకొని ఆరోగ్యంగా ఉండటానికి ఈ మనం తినే ఆహారంలోని రుచుల విషయంలో సమతుల్యత పాటిద్దాం. ఆరోగ్యంగా జీవిద్దాం. మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి పునర్జన్ ఆయుర్వేద బ్లాగ్స్ ఫాలో అవ్వండి.