త్రిఫల అనే పదంలోనే మూడు ఫలాల కలయిక అనే అర్థం ఉంది,
ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఉసిరికాయ, తానికాయ, కరక్కాయల మూడిటి మిశ్రమాన్ని త్రిఫల చూర్ణం అంటారు.
ఉసిరికాయ వేడిని తగ్గించి, చలువ చేసే గుణం కలిగి ఉంటుంది అలగే మలబద్దకాన్ని పోగొడుతుంది.
ఇక కరక్కాయ కాలేయ లోపాలను సరిదిద్దుతుంది అలాగే నాడీసంబంధ వ్యాధులను నివారిస్తుంది.
తానికాయ ఆస్తమా చికిత్సకు ఉపయోగపడుతుంది ఇంకా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
ఈ మూడింటి చూర్ణం అయిన త్రిఫల చూర్ణాన్ని త్రిదోష రసాయనంగా పరిగణిస్తారు. మన శరీర ఆరోగ్యంలో వాత, పిత్త, కఫ దోషాలను త్రిఫల చూర్ణం సరిచేస్తుంది. వాతం నాడీ వ్యవస్థకు, పిత్తం జీవక్రియకు, కఫం శారీరక నిర్మాణానికి సంబంధించినది. ఈ మూడింటిని మెరుగుపరిచే గుణం త్రిఫలకు ఉంది.దగ్గు, బొంగురు గొంతు నివారణకు త్రిఫలచూర్ణం వాడితే ఫలితం బాగా ఉంటుంది. అలాగే ప్రేగులలో సమస్యలను సరిచేసేందుకు, మొలలు తగ్గేందుకు, కడుపులో మంటను పోగొట్టేందుకు త్రిఫల చూర్ణం మంచి ఔషధంగా పనిచేస్తుంది.
త్రిఫల చూర్ణంలో ఉపయోగించే ఫలాల ఔషధ గుణాల గురించి చూద్దాం.
ఉసిరి
ఉసిరిలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఆమ్లం, గ్లోకోజ్, ప్రొటీన్, కాల్షియంలు ఉంటాయి. ఉసిరి పిత్తదోషాన్నినివారించి శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది. అలాగే రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇంకా జ్వరాన్ని కూడా తగ్గిస్తుంది. కడుపులో వాపు, పేగుగోడలు వాపు, కడుపులో మంటలు, పుండ్లకు ఉసిరి బాగా పనిచేస్తుంది.. బత్తాయితో పోలిస్తే పదిహేను రెట్లు అధికంగా సి విటమిన్ ఉసిరిలో ఉంటాయి.
కరక్కాయ
త్రిఫలచూర్ణంలోని ముఖ్యమైన ఫలాల్లో కరక్కాయ ఒకటి. ఇది విరోచనాలను అరికడుతుంది అలాగే ఛాతిలో మంటను తగ్గిస్తుంది. ఇంకా కాలేయం సరిగా పనిచేసేటట్లు చేసి వాతాన్ని అరికడుతుంది. నాడీ సంబంధిత ఇబ్బందులను తొలగించటంలో కరక్కాయ సహాయపడుతుంది.శారీరక బలహీనతను కూడా కరక్కాయ సరిచేయగలదు అలాగే జీర్ణాశయపు గోడలను బలంగా చేసి జీర్ణక్రియను మేరుగుచేస్తుంది.
తానికాయ
తానికాయ వగరు మరియు చేదు రుచిని కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది అలర్జీలను నివారించగలదు మరియు గొంతు సమస్యలను దూరం చేస్తుంది. తానికాయ గ్యాస్ట్రిక్ అల్సర్ రక్తస్రావం పై కూడా ప్రభావం చూపగలదు.
త్రిఫల ఉపయోగాలు
ఇక ఈ మూడు పండ్లను ఒక చెంచా చూర్ణం చేసి, ఉడకబెట్టి, వడకట్టి సేవిస్తే అతిసారం, అజీర్ణం తగ్గుతాయి. మలబద్ధకం ఏర్పడినప్పుడు, నాలుగు గ్రాముల త్రిఫలచూర్ణంలో కొద్దిగా తేనె కలిపి, రాత్రి పడుకునే ముందు పాలలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
అలాగే కొబ్బరి నూనెలో ఒక చెంచా త్రిఫలచూర్ణం వేసి, తక్కువ వేడి మీద మరిగించి, ఫిల్టర్ చేసి, జుట్టు పెరుగుదల కోసం మీ తలకు నూనె రాస్తే ఇది జుట్టుకు బలాన్నిస్తుంది. అలాగే తలస్నానం చేస్తే చివర్లో త్రిఫలచూర్ణం కాషాయాన్ని తలపై పోసుకుంటే జుట్టు నల్లగా మెరుస్తూ ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే త్రిఫల రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీనివల్ల చర్మవ్యాధులు దూరమవుతాయి. త్రిఫల అన్ని చర్మ రకాలకు అనుకూలంగా ఉంది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే శరీరం నుండి టాక్సిన్స్ ను కూడా తొలగిస్తుంది.అలర్జీ తో బాధపడేవారికి కూడా త్రిఫల సహాయపడుతుంది .ఇన్ని సమస్యలకు పరిష్కారమవుతుంది కాబట్టే త్రిఫలకు ఆయుర్వేదంలో అంతప్రాముఖ్యత ఏర్పడింది.
మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
Also Read: ఏ పాత్రలో నీరు త్రాగితే ఎంత ప్రయోజనమో మీకు తెలుసా?
Disclaimer:
This information on this article is not intended to be a substitute for professional medical advice, diagnosis, treatment, or standard medicines. All content on this site contained through this Website is for general information purposes only.